
Shivratri Special Story: శివుడు పంచముఖుడు. నాలుగు దిక్కులా, నాలుగు ముఖాలతో, ఉర్ద్వ దిశలో ఐదో ముఖంతో చూస్తూ ఉంటాడు. ఈ ఐదు ముఖాలు ఐదు నామాలతో, ఐదు క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అవి అఘోరం( అమరావతి), తత్పురుష ( ద్రాక్షారామం), వామదేవ (సామర్లకోట) సద్యోజాత(భీమవరం), ఈశాన( పాలకొల్లు). యుగయుగాలుగా ఈ రూపాలతో శివుడు పూజలు అందుకుంటున్నాడు.
అమరరామం
కృష్ణా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇంద్రుడు దీన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడి ఐదు ముఖాల్లో ఇది అఘోర రూపం. అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న ఈ లింగం 16 అడుగుల ఎత్తుతో కనిపిస్తుంది. గర్భాలయం రెండు అంతస్తులు ఉంటుంది. అభిషేకాలను పై అంతస్తు నుంచి నిర్వహిస్తారు. మూడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్తీశ్వరుడు, పార్థివేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు పేర్లతో శివుడు కొలువై ఉన్నాడు.. ఇతర శివ పరివారమంతా ఆరాధనలు అందుకుంటున్నారు. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ బాల చాముండేశ్వరి. మహాశివరాత్రి నాడు ఇక్కడ భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.
ద్రాక్షారామం
సూర్యుడు ప్రతిష్టించిన ఈ లింగాన్ని భీమేశ్వరుడిగా కొలుస్తారు. శివుడి 5 ముఖాల్లో ఇది తత్పురుష రూపం. సప్త గోదావరి తీర్థంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరుపొందిన ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడి అమ్మవారి పేరు మాణిక్యంబా దేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి. శివుడి భుజం పై ఉన్న సతీదేవిని శ్రీమహావిష్ణువు ఖండిస్తున్నప్పుడు.. ఆమె కణత భాగం పడిన స్థలంగా దీన్ని పురాణాలు వర్ణించాయి. ఆలయానికి నాలుగు పక్కలా ఎత్తైన గోపురాలు, ఆలయ శిల్పకళా నైపుణ్యం కను విందు చేస్తాయి. క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నారాయణుడు. తూర్పు చాళక్యులు నిర్మించిన ఈ ఆలయంలోని భీమేశ్వరం లింగం భోగ లింగం కాబట్టి సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాన్ని అభిషేకిస్తారు. పది అడుగుల భీమేశ్వరుడి ఆలయంలో గర్భాలయం రెండు అంతస్తులు ఉంటుంది. అభిషేకాలను పై అంతస్తు నుంచి నిర్వహిస్తారు. లింగం తెలుపు, నలుపు ఛాయల్లో ఉంటుంది. ఇక్కడ పలు దేవీ దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి.
కుమార రామం
స్వామి ప్రతిష్టించిన వామదేవ స్వరూపుడు ఇక్కడ కుమార భీమేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇది యోగ లింగం. సామర్లకోటలో రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉంటుంది. అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. క్షేత్రపాలకుడు మాండవ్య నారాయణుడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతస్తుల ఈ ఆలయంలోని శివలింగంపై చైత్ర, వైశాఖ మాసాల్లోని ఉభయ సంఖ్యల్లో సూర్యకిరణాలు పడతాయి. ఆలయ ఆవరణలోని భీమకుండంలో స్నానం సర్వపాపహరంగా భావిస్తారు. కార్తీక మాసంలో, మాస శివరాత్రులలో భక్తులు విశేషంగా స్వామిని దర్శిస్తారు. మహాశివరాత్రి రోజు ఉత్సవాలు జరుగుతాయి.
సోమారామం
సద్యోజాత రూపమైన ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడు. అందుకే ఇది సోమారామంగా పేరుపొందింది. పౌర్ణమి రోజున చంద్రుడు షోడశ కళలతో శ్వేత వర్ణంలో కనువిందు చేసే ఈ లింగం కృష్ణ పక్షంలో క్రమేపి వన్నె తగ్గి, అమావాస్యనాడు బూడిద వర్ణంలో కనిపిస్తుంది. తిరిగి శుక్లపక్షంలో ఛాయ క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి నాటికి శ్వేత వర్ణానికి వస్తుంది. భీమవరం సమీపంలోని గునుపూడి లో ఉన్న సోమారామంలో కార్తీక మాసంలో, మాస శివరాత్రుల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి. క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి. దీనిని చాళుక్య భీముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

క్షీరా రామం
ఈశాన రూపుడైన శివలింగాన్ని మహావిష్ణువు ప్రతిష్టించాడని ప్రతీతీ. తారకాసురుడి ఆత్మలింగం లోని కొప్పు భాగం.. అంటే ఊర్ధ్వముఖంగా ఉండే ఈశాన రూపం క్షీరపురంలో పడిందని స్థల పురాణం చెబుతోంది. త్రేతా యుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి గురువైన సాందీపుడు దర్శించిన క్షేత్రం గానూ ఇది విఖ్యాతి పొందింది. ముని బాలకుడైన ఉపమన్యుడు శిశుప్రాయంలో పాలు లేక సతమతమవుతున్నప్పుడు.. శివుడు తన త్రిశూలంతో భూమిపై గుచ్చాడని, నేల నుంచి స్వచ్ఛమైన పాలు ఉతికి వచ్చి కొలనుగా మారాయని, ఆ పాలకొలనే పాలకొల్లు గా మారిందని క్షేత్ర మహత్యం వెల్లడిస్తోంది. గోస్తని నది తీరాన నెలకొన్న ఈ ఆలయంలో శివుడి కొప్పు భాగం దర్శనమిస్తుంది. కాబట్టి ఆయనను కొప్పు లింగేశ్వరుడి గా భక్తులు పిలుస్తారు. అమ్మ వారి పేరు పార్వతి దేవి. క్షేత్రపాలకుడు శ్రీమహావిష్ణువు. కార్తీక మాసంలో, మాస శివరాత్రుల్లో విశేష పూజలు జరుగుతాయి.. ఈ ఆలయంలో శివకేశ పరివార దేవతలకు ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ గోపుర విమానాలు ఉండటం విశేషం.