
R. Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అంటే పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఓ గౌరవం, అభిమానం ఉంటాయి. సినిమాను సోషల్ సర్వీస్ గా భావించారాయన. తన సినిమాలతో జనాల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. వ్యవస్థలలోని లోపాలు ఎండగట్టారు. పేదోడి బాధలను లోతుగా చర్చించిన దర్శక నిర్మాత నటుడు. కార్మిక, కర్షక పక్షపాతిగా వారి తరపున పదుల సంఖ్యలో సినిమాలు చేశారు.
ఆర్ ఆర్ ఆర్ నారాయణమూర్తి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మల్లంపేట అనే గ్రామంలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1973లో విడుదలైన నేరము శిక్ష చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్ర చేశారు. ఆ చిత్రంలో కృష్ణ హీరోగా నటించారు. దాసరి నారాయణరావు సలహా మేరకు చదువు పూర్తి చేద్దామని తిరిగి సొంతూరుకు వచ్చేశారు. బీఏ పూర్తి కాగానే ఆర్ నారాయణమూర్తి మరలా చెన్నై రైలెక్కారు.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’ మూవీలో సెకండ్ హీరో రోల్ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాసరి సీతారాములు మూవీలో మరో అవకాశం ఇచ్చారు. ఆర్ నారాయణమూర్తి మెల్లగా విప్లవ సినిమాల వైపు మళ్ళాడు. అర్ధరాత్రి స్వాతంత్య్రం, ఆలోచించండి, భూపోరాటం, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా వంటి చిత్రాలు చేశారు. స్నేహ చిత్ర పిక్చర్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించారు.

ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటించిన ఒరేయ్ రిక్షా సూపర్ హిట్. ఆ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో భారీ హిట్ ఎర్ర సైన్యం. అప్పట్లో ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా సినిమా పాటలు ఊరూరా వినిపించేవి. జయాపజయాలు, లాభనష్టాలు ఆలోచించడకుండా ఆర్ నారాయణమూర్తి సమాజహితం కోరే సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన యూనివర్సిటీ టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఇది విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించేదిగా ఉంటుందని సమాచారం. ఇటీవల యూనివర్సిటీ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించగా బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక కనీసం ఇల్లు కూడా లేని ఆర్ నారాయణమూర్తి ఆర్థిక ఇబ్బందిపడుతున్నారని ఇండస్ట్రీ టాక్.