Hyderabad : అగ్గి అంటుకుంది.. అందులో దాచిన 1.64 కోట్లు బయటకొచ్చింది.. అదిరిపోయే ట్విస్ట్

వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అది హవాలా డబ్బుగా గుర్తించిన పోలీసులు.. దానిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పంపించారు. కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన వివరాలు కనుక్కునే పనిలో ఉన్నారు.

Written By: Rocky, Updated On : May 14, 2023 6:16 pm
Follow us on

Hyderabad : పొద్దంతా కష్టపడినా నోట్లోకి ఐదు వేళ్ళు వెళ్ళలేని పేదలు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. నేటికీ దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలి అనిపిస్తే భూదేవి వైపు చూసే పేదలు చాలామంది ఉన్నారు.. అలాంటి సమాజంలో ఎంతోమంది అక్రమార్కలు కూడా ఉన్నారు. చట్టాన్ని పట్టించుకోని, వ్యవస్థలను లెక్కచేయని వీరు.. సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్నారు.. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు సంపాదిస్తూ వ్యవస్థలను శాసిస్తున్నారు.. అలా సంపాదించిన డబ్బుకు మన వ్యవస్థ పెట్టిన పేరు “హవాలా”.. ఇలాంటి సొమ్ము పన్ను పరిధిలోకి రాదు.. అంటే ఒకరకంగా చెప్పాలంటే అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రభుత్వం కంటపడకుండా ప్రాంతాలు దాటించేయడం అన్నమాట. అలాంటి హవాలా డబ్బు హైదరాబాదులో దొరికింది. అసలు అది దొరికిన విధానమే సినిమా ఫక్కీని తలపిస్తోంది.

ఏం జరిగిందంటే..

ఢిల్లీలోని బెంగాల్ బజార్ అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి కేంద్రంగా హవాలా రూపంలో డబ్బులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించే సమర్థవంతమైన వ్యవస్థ ఉంటుంది. వీరు దేశంలో పెద్ద పెద్ద కోటీశ్వరుల నుంచి రాజకీయ నాయకుల వరకు అచ్చం శివాజీ సినిమాలో చూపించినట్టు డబ్బులు రాత్రికి రాత్రే ప్రాంతాలు తరలిస్తారు. లక్షల నుంచి వందల కోట్ల వరకు దాటించేస్తుంటారు. అలా ఢిల్లీ నుంచి హవాలా మార్గంలో హైదరాబాద్ లోని ఓ ప్రాంతానికి డబ్బు తరిలింది. అయితే పాపపు సొమ్ము ను ఎల్లకాలం దాయడం కుదరదు కాబట్టి.. అది బయటపడింది. దానిని చూసిన పోలీసులకు ఊపిరి ఆగినంత పనయింది. హైదరాబాదులోని రెజిమెంటల్ బజార్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది వివిధ వ్యాపారాలకు పెట్టింది పేరు. ఇక్కడ కర్రతో ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమలు ఉంటాయి.. అయితే శనివారం రాత్రి ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దానివల్ల ఓ అపార్ట్మెంట్లో ఉన్న ప్లాట్ నుంచి భారీగా మంటలు వచ్చాయి. దీంతో కంగారుపడిన పక్కింటివాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలన చేశారు.

కళ్ళు చెదిరే డబ్బు

అయితే ఆ ఫ్లాట్లో లో ఎవరూ లేకపోవడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి మంటలు ఆదుపులోకి తీసుకొచ్చారు. మంటల వల్ల ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా అని ఆరా తీస్తుండగా.. కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆ ప్లాట్ లోని బెడ్ రూమ్ లోకి వెళ్ళగా.. అందులో కట్టలకు కట్టలు నగదు కనిపించింది. అగ్ని ప్రమాదంలో సంభవించిన మంటలో తాకిడికి ఉడ్ ఫర్నిచర్ కాలిపోయి అందులో నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలు లెక్కించగా 1.64 కోట్లుగా తేలిందని పోలీసులు ప్రకటించారు. అయితే ఈ సమాచారాన్ని ఆ ఫ్లాట్ యజమానులకు అందించగా.. వారు భయం గా ఆ ప్రాంతానికి వచ్చారు. ఈ డబ్బుకు సంబంధించి ఆధారాలు చూపించాలని అడిగితే.. వారు నీళ్లు నమిలారు. అంతేకాదు వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అది హవాలా డబ్బుగా గుర్తించిన పోలీసులు.. దానిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పంపించారు. కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన వివరాలు కనుక్కునే పనిలో ఉన్నారు. కాగా ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ డబ్బు ఓ అధికార పార్టీ నేతకు చెందినదిగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు కొంతమంది పెద్దలు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.