Danionella: సాధారణంగా మనకు తెలిసిన చేపలు నీటిలో ఈదుతాయి. మత్స్యకారులు వలవేస్తే చిక్కుతాయి. శుభ్రంగా కడిగి పులుసు పెట్టి వండితే కూరవుతాయి. కానీ ఎక్కడైనా చేపలు శబ్దాలు చేయడం మీరు విన్నారా? అవి నడవడం చూశారా? ఈ ప్రశ్నలకు లేదు అనే కదా మీ సమాధానం.. అయితే ఈ కథనం చదవండి.. మీరు ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తాయి..
ఆ చేప పేరు Danionella cerebrum. ఇది కూత పెడితే చెవుల నుంచి రక్తం కారాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటుంటాం కదా.. దీనిని చూస్తే చేప చిన్నది.. చేసే శబ్దం పెద్దది అని అనుకోవాలి.. Danionella cerebrum రూపానికి మనిషి గోరు పరిమాణంలో ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఇది 12 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దీనిని మయన్మార్ ప్రాంతంలో కనుగొన్నారు. అయితే ఈ చేప చేసే శబ్దానికి చెవులకు చిల్లులు పడతాయని బెర్లిన్ ప్రాంతానికి చెందిన చారైట్ శాస్త్రవేత్తలు అంటున్నారు.. ఈ చేపలు తమ కూతల ద్వారా 140 డెసిబుల్స్ తీవ్రత వరకు శబ్దం చేస్తాయని తెలుస్తోంది. డ్రిల్లింగ్ మిషన్, బస్సు, అంబులెన్స్ సైరన్ శబ్దానికి సమానంగా వీటి కూత ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే అవి ఎందుకు అలా శబ్దాలను ఉత్పత్తి చేస్తాయనే దానిపై పరిశోధనలు జరుపుతున్నామని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ చేప నడుస్తుంది
నీటిలో చేపలు ఈదుతాయి.. అదేమైనా గొప్ప విషయమా? అనుకుంటున్నారు కదా.. కానీ ఈ చేప సముద్ర జలాల్లో నడుస్తుంది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. చిలీ లోని కోస్తా తీరం ప్రాంతంలో అరుదైన జాతికి చెందిన ఓ నడిచే చేప శాస్త్రవేత్తల కెమెరాకు చిక్కింది. రెండు కాళ్లు, రెండు చేతులు కలిగి ఉన్న ఈ చేప సముద్రంలో నడుస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఇటీవల చిలీ కోస్తా తీర ప్రాంతంలో పరిశోధనలు జరిపింది. అందులో 100కు పైగా కొత్త జాతుల్ని గుర్తించింది.. వాటిల్లో ఈ నడిచే చేపలు ప్రత్యేకంగా కనిపించాయి.
శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం ఈ చేపలు అత్యంత లోతైన ప్రాంతాల్లో ఆవాసాన్ని ఏర్పరుచుకుంటాయి. కొన్ని దశాబ్దాల అనంతరం అవి పైకి వస్తాయి.. ఆహార అన్వేషణలో భాగంగా అవి అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. సముద్ర గర్భంలోనూ వాటికీ ఆహారం లభించినప్పటికీ.. జీవ సందీప్తత కారణంగా అవి బయటకు వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి తిరిగే ప్రాంతంలోకి వెళ్లాలి అంటే కష్టం కాబట్టి.. వాటి ఆవాసాలు కనుగొనేందుకు రోబోలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇదే సమయంలో నాలుగు కొత్త సముద్ర పర్వతాలను కూడా వారు కనుగొన్నారు. అయితే ఈ చేపకు మనిషి మాదిరి కాళ్లు, చేతులు ఎలా ఏర్పడతాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.