
Regenerate Body Parts: శరీరంలో ప్రతీ అవయవమూ ముఖ్యమే. ఏది పోయినా వైకల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కొన్ని అవయవాలు కోల్పోతే మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊరటనిచ్చేలా కొన్ని దశాబ్దాల క్రితం కృత్రిమ అవయవాలు వచ్చాయి. కాళ్లు, చేతులు పూర్తిగా కోల్పోయినప్పుడు వీటిని అమర్చడం ద్వారా లోపాన్ని కాస్త కవర్ చేస్తున్నారు. కాస్త ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే ఎంతైనా అది కృత్రిమమే అన్నట్లుగా ఉన్నాయి. ఈ తరరుణంలో శాస్త్రవేత్తలు చేస్తున్న కొన్ని ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో ఇక కాలు పోయినా చేయి పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చన్న విశ్వాసం కలుగుతోంది.
తెగిపోతే తిరిగి మొలిపించేలా..
మనిషి శరీరంలో తెగిపోయిన కాళ్లు, చేతులను తిరిగి మొలిపించేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. చేతులు, కాళ్లలో పెరిగే కణాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జింక శరీరంలో దాని కొమ్ములను పునరుత్పత్తి చేసేందుకు బ్లాస్టెమా కణాలు ఉపకరిస్తాయి. ఈ కణాలను శాస్త్రవేత్తలు మనిషి ప్రయోజనం కోసం ఉపయోగించాలనుకుంటున్నారు. దీంతో తెగిపోయిన అవయవాలు కూడా తిరిగి పెరుగుతాయని పేర్కొంటున్నారు.
ప్రయోగాల్లో ఆశ్చర్యకర ఫలితాలు
సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని చైనాలోని జియాన్‌లో గల నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. జింక శరీరంలో లభించిన బ్లాస్టెమా ప్రొజెనిటర్ కణాలను శాస్త్రవేత్తలు ఎలుక తలలోకి చొప్పించారు. 45 రోజుల తర్వాత దాని తలపై కొమ్ము లాంటి ఆకారం ఉద్భవించింది. ఈ నమూనాతో మానవ అవయవాలను తిరిగి అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.

మనిషిలోనూ సత్ఫలితాలు వచ్చే చాన్స్..
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బ్లాస్టెమా కణాలను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి ఎముకలు, మృదులాస్థులను తిరిగి పెంచే అవకాశం ఉంది. ఇదేవిధంగా అనేక క్షీరద జీవులలో స్వీయ–పునరుద్ధరణ కణాలు కనిపిస్తాయి. ఎలుకలు కూడా ఈ రకమైన కణాలను కలిగి ఉంటాయి, అయితే ఈ కణాలను ఉపయోగించే జంతువు జింక మాత్రమే అని తేలింది. జింక కొమ్ములు విరిగిపోయినప్పుడు బ్లాస్టెమా కణాలు వెంటనే చురుగ్గా పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. కొమ్ము పూర్తిగా పడిపోయిన తర్వాత, కొత్త కొమ్ము ఉద్భవిస్తుంది.
ఇదే తీరున మనిషి రశీరంలో ఏ అవయం కోల్పోయినా బ్లాస్టెమా కణాలనుప్రవేశపెట్టడం ద్వారా తిరిగి మొలుస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే మనుషులపైనా ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ప్రయోగాలు విజయవంతం అయితే, ఇక వైకల్యం అనేది ఉండదంటున్నారు శాస్త్రవేత్తలు. సమస్త మానవాళికి ఉపయోగపడే ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ కావాలని మనమూ ఆశిద్దాం.