
Jagan- YCP MLAs: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో అధికార వైసీపీలో కలవరం ప్రారంభమైందా? ప్రతికూలతలు తప్పవని భావిస్తోందా? ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీఎన్నికల్లో జాగ్రత్తలు అందులో భాగమేనా? ఎన్నడూ లేని విధంగా మాక్ పోలింగ్ నిర్వహించడం దేనికి సంకేతం? భయం లేదంటూనే ఆ పార్టీలో భయం మొదలైందా? అంటే అవునననే సమాధానం వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్న ఎనిమిది ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ శ్రమిస్తోంది. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. మాక్ పోలింగ్ లో అన్నిరకాల జాగ్రత్తలు చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి లోపాలు తలెత్తకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్టు వైసీపీ చెబుతున్నా.. ఒక విధంగా ఇది క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అధికార పార్టీకి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధిక్కరించడం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, కీలకమైన రాయసీమ జిల్లాలో స్థానాలు చేజారిపోవడంతో జగన్ సర్కారులో ఒకరకమైన ఫోబియో ప్రారంభమైంది. ఆనం, కోటంరెడ్డిని ఇంకెవరైనా అనుసరిస్తున్నారా? అని ఆరా తీయడం మొదలైంది. ఆ బాధ్యతలను మంత్రులకు అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల కదలికలపై ప్రభుత్వ నిఘావర్గాలు, ఐ ప్యాంక్ బృందం ప్రత్యేకంగా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఎవరెవరిని కలుస్తున్నారు వంటి వాటిపై దృష్టిపెట్టినట్టు సమాచారం. గతంలో పార్టీకి ధిక్కార స్వరం వినిపించకముందే కోటంరెడ్డి చంద్రబాబును కలిసినట్టు ఆరోపిస్తున్నారు. ఏ నంబరు, ఏ కలర్ కారులో వెళ్లింది కూడా చెబుతున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటా కింద ఎనిమిది స్థానాలు ఖాళీ అయ్యాయి. సంఖ్యాపరంగా అందులో ఒక సీటు టీడీపీకి వెళుతుంది. కానీ జగన్ మాత్రం తన పార్టీ అభ్యర్థులను ఎనిమిది మందిని బరిలో నిలిపారు. తనకున్న బలంతో ఏడింటిని సునాయాసంగా గెలుచుకోగలరు. కానీ మరో సీటును కూడా ఎందుకు గెలవకూడదని భావిస్తున్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆ బలాన్ని సమానంగా పంచితే నలుగురికి 22 ఓట్లు, మరో ముగ్గురికి 21 ఓట్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వైసీపీ కంటే ఒకే ఒక అభ్యర్థిని బరిలో దించిన టీడీపీకి ఓట్లు ఒకటి, రెండు ఓట్లు ఎక్కువగా పోల్ కావాలి. ఈ లెక్కన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ గెలుపు పక్కా అన్న మాట.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో ఫిరాయించారు. వారు వైసీపీకి ఓటు వేయకపోయినా టీడీపీకి లాభమే. వైసీపీ హైకమాండ్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ధిక్కరించారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబల్ గా మారారు. వారు ఆత్మ ప్రభోదానసారం ఓట్లు వేస్తామని ప్రకటించారు. వారు కానీ గైర్హాజరైతే వైసీపీకి రెండు ఓట్లు తగ్గిపోతాయి. వారు కానీ టీడీపీకి సపోర్టు చేస్తే మాత్రం పార్టీకి భారీ అడ్వాంటేజ్. అయితే వారు ఓటు వేసిన మరుక్షణం వారిపై అనర్హత వేటు పడుతుంది. అటు టీడీపీని ధిక్కరించిన నలుగురిపై కూడా అదే ఎదురవుతుంది.