RRR Oscar: ఎన్నడూ లేని విధంగా ఇండియన్ ఆడియన్స్ లో ఆస్కార్ అవార్డుపై చర్చ నడుస్తోంది. దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ మూవీ. రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్, విజువల్ వండర్ ఏదో ఒక విభాగంలో ఆస్కార్ గెలవచ్చన్న వాదన ఉంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఆస్కార్ నామినేషన్స్ కి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయలేదు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ‘చల్లో షో’ చిత్రాన్ని అధికారికంగా భారత్ తరపున ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మరో అవకాశం ఉంది. లాస్స్ ఏంజెల్స్ లో రెండు వారాలకు పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించబడిన ఏ చిత్రమైనా జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కొరకు అప్లై చేసుకోవచ్చు.

ఈ క్రమంలో బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేశారు. అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యింది. ఈ ఒక్క విభాగంలో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ రేసులో నిలవనుందని ప్రాధమికంగా తెలుస్తున్న సమాచారం. కొన్ని నెలలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంటారని ప్రచారం జరుగుతుంది.
ఇది ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ కి కూడా కారణమైంది. తమ తమ హీరోలను సప్పోర్ట్ చేస్తూ… ఆస్కార్ గెలుస్తున్నాడంటూ ట్విట్టర్ లో ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే అదంత సులభం కాదు. ఆస్కార్ రేసు నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ తప్పుకున్నట్లే. ఆర్ ఆర్ ఆర్ నామినేషన్స్ కి అప్లై చేసిన విభాగాల్లో ఒరిజినల్ సాంగ్ ‘నాటు నాటు’ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యింది.
అద్భుత నటన కనబరిచినప్పటికీ… ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో చోటు ఎందుకు దక్కలేదు? ఆస్కార్ స్థాయి ప్రమాణాలు వారిలో లేవా? అంటే ఉన్నాయి. అయితే ఆస్కార్ జ్యూరీ సభ్యులు ఎంపిక క్రైటీరియా ప్రకారం చరణ్, ఎన్టీఆర్ అర్హులు కాకపోవచ్చు. ఆస్కార్ హిస్టరీ గమనిస్తే… ఆర్ట్ ఫిల్మ్స్ కి మాత్రమే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు అవార్డులు దక్కుతాయి. సున్నితమైన భావాలు, లోతైన ఎమోషన్స్ కలిగిన కథలు, సన్నివేశాలతో కూడిన చిత్రాలకు… సదరు ఆర్ట్ ఫిల్మ్స్ లో నటించిన నటులను ఆస్కార్ అవార్డులు వరిస్తాయి. కమర్షియల్ చిత్రాల నుండి ఉత్తమ నటుడు అవార్డ్స్ గెలుచుకున్న సందర్భాలు చాలా అరుదు.

కమర్షియల్ చిత్రాలకు విజువల్స్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటి సాంకేతిక విభాగాల్లో అవార్డ్స్ దక్కే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో చూస్తే ఆర్ ఆర్ ఆర్ ఆర్ట్ ఫిల్మ్ కాదు. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన కమర్షియల్ చిత్రం. భీమ్, రామ్ పాత్రలకు బలమైన ఎమోషన్, నటన పండించే అవకాశం ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఇద్దరూ గొప్పగా నటించారు. ఆస్కార్ ప్రమాణాలకు, జ్యూరీ సభ్యుల దృష్టి కోణంలో అది సరిపోదు. ఇక సాంకేతిక అంశాల్లో మనం హాలీవుడ్ చిత్రాలతో పోటీపడలేము. వారి బడ్జెట్ లెక్కలు, అందుబాటులో ఉన్న సాంకేతికత వేరు. ఈ కారణాలతో చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో వెనుకబడ్డారు.