RRR On Oscar: ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలుస్తుందని భారతీయులు గట్టిగా నమ్ముతున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఈ మూవీ సత్తా చాటుతున్న నేపథ్యంలో ఆశలు బలపడుతున్నాయి. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం, దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. ప్రతిష్టాత్మక వేదికల మీద ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించడం జరిగింది. అత్యంత గౌరవంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి రెండు విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ నామినేట్ అయ్యింది. జనవరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు) విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ దక్కించుకుంది.

అలాగే లండన్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ లో నామినేషన్స్ సాధించింది. ఫారిన్ మూవీ ఆఫ్ ది ఇయర్, టెక్నికల్ అచీవ్మెంట్స్ అవార్డ్స్(స్టంట్స్) విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఈ పరిణామాలతో ఆస్కార్ పై నమ్మకం పెరుగుతుండగా, ఆర్ ఆర్ ఆర్ మూవీ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించింది. ఆస్కార్ షార్ట్ లిస్ట్ జాబితాలో ఆర్ ఆర్ ఆర్ కి చోటు దక్కింది. దీంతో ఆస్కార్ అవార్డు వైపు ఆర్ ఆర్ ఆర్ ఒక అడుగు ముందుకు వేసినట్లు అయ్యింది.
ఒరిజినల్ సాంగ్ నాటు నాటు విభాగంలో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ అయ్యింది. కాగా భారతదేశం తరపున జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఛల్లో షో చిత్రం కూడా షార్ట్ లిస్ట్ కావడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేశారు. లాస్స్ ఏంజెల్స్ లో ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లో కొన్ని వారాలు ఆడింది. ఆ విధంగా జనరల్ కేటగిరీలో నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో వసూళ్ళు దుమ్మురేపుతోంది. అక్కడ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ గా రికార్డులకు ఎక్కింది. రజినీకాంత్ ముత్తు నెలకొల్పిన ¥ 400 మిలియన్ వసూళ్ల రికార్డు ఆర్ ఆర్ ఆర్ అధిగమించింది. దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ భీమ్, చరణ్ అల్లూరి పాత్రలు చేశారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. అమెరికాలో $ 14 మిలియన్ వసూళ్లు సాధించింది.