
రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా “ఆర్ఆర్ఆర్” (రౌద్రం రణం రుధిరం) సినిమాకు లీకుల బెడద ఎక్కువైపోతోంది. బాహుబలి సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోలతో రాజమౌళి తీస్తున్న ఈ మూవీ మీద ఇండియా అంతటా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఆర్ఆర్ఆర్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాలలో వైరల్ అవుతుంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ బాలుడు ఫోటో లీకై నెట్లో చెక్కర్లు కొడుతోంది. ధృవన్ అనే ఓ చైల్డ్ ఆర్టిస్టు తన సోషల్ మీడియా ఖాతాలో అడవిలో చెక్క దుంగల మీద కూర్చుని ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ…ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటో అంటూ క్యాప్షన్ పెట్టాడు. అది చూసిన నెటిజన్లు ఆగుతారా… అల్లూరిగా నటిస్తున్న చరణ్ చిన్ననాటి పాత్రకి సంబంధించినిదా లేక కొమరం భీమ్ గా నటిస్తున్న తారక్ చిన్నప్పటి ఫోటోనా అని తమ బుర్రలకి పని పెడుతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుందని మేకర్స్ ఇటీవలనే ప్రకటించారు.