Highest Grossing Movies: ఈ ఏడాది టాలీవుడ్ కి ఒకరకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా సక్సెస్ లతో పాటు మంచి కమర్షియల్ హిట్స్ కూడా పడ్డాయి. 2022 టాప్ టెన్ చిత్రాల కలెక్షన్స్ మొత్తం కలిపితే రూ. 2200 కోట్లు. అయితే వాటిలో సింహ భాగం ఆర్ ఆర్ ఆర్ చిత్రానిదే… ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు వాటి లెక్కలు చూద్దాం.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ అంచనాలకు మించి వసూలు చేసింది. కరోనా సంక్షోభం అనంతరం వేల కోట్ల వసూళ్లు కష్టం అని భావిస్తున్న ట్రేడ్ వర్గాలను ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు ఆశ్చర్యపరిచాయి. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లు వసూలు చేసింది. మహేష్ సర్కారు వారి పాట అంటూ వచ్చి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు పరుశురాం సందేశాత్మకంగా సర్కారు వారి పాట తెరకెక్కించారు. దాదాపు రూ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 180 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి హింట్ వెంచర్ గా నిలిచింది.
కమ్ బ్యాక్ అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన రెండవ చిత్రం భీమ్లా నాయక్. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 161 కోట్ల వసూళ్లు అందుకుంది. ప్రభాస్ నుండి భారీ అంచనాలతో వచ్చిన మరో పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు. కేవలం రూ. 151 కోట్ల వసూళ్లతో పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. ప్లాప్ అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.
ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 దాదాపు రూ. 73 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. వెంకీ-వరుణ్ ల ఈ మల్టీస్టారర్ రూ. 134 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. టాలీవుడ్ కి భారీ లాభాలు తెచ్చిన చిత్రాల్లో కార్తికేయ 2 ఒకటి. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించింది. చిరంజీవి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. సల్మాన్ కీలక రోల్ చేసిన గాడ్ ఫాదర్ రూ. 100 కోట్లతో తెరకెక్కి రూ. 150 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఈ ఏడాది అద్భుతం చేసిన చిత్రాల్లో సీతారామం ఒకటి. దుల్కర్ సల్మాన్, రష్మిక మందాన, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ రూ. 30 కోట్లతో తెరకెక్కి రూ. 90 కోట్ల వసూళ్లు సాధించింది. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య రూ. 76 కోట్ల వసూళ్లు మాత్రమే అందుకొని నష్టాలు మిగిల్చింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అధిక లాభాలు పంచిన చిత్రాల జాబితాలో బింబిసార కూడా ఉంది. కళ్యాణ్ రామ్ కి మెమరబుల్ హిట్ ఇచ్చిన బింబిసార రూ. 40 కోట్లతో నిర్మితమై రూ. 65 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.