Bigg Boss 6 Telugu Winner Revanth: 21 మంది కంటెస్టెంట్స్ తో 105 రోజులు పోరాటం చేసి బిగ్ బాస్ టైటిల్ అందుకున్నాడు సింగర్ రేవంత్. టాప్ సెలబ్రిటీ హోదాలో రేవంత్ అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టాడు. ఆ అంచనాలు తప్పకుండా బిగ్ బాస్ తెలుగు 6 టైటిల్ ముద్దాడాడు. మొదటి నుండి రేవంత్ లో ఆ విశ్వాసం ఉంది. టైటిల్ నాదే అన్న నమ్మకం ప్రదర్శిస్తూ వచ్చాడు. టైటిల్ గెలవడం కోసం బాగా కష్టపడ్డాడు. టాస్క్స్ లో రేవంత్ పోరాట పటిమ చూపించేవాడు. ప్రతిసారి గెలుపుకోసం ప్రయత్నం చేసేవాడు. ఓటమిని అంగీకరించని రేవంత్… విన్నర్ కావడం కోసం వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు.

రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి వెళ్లారు. రోహిత్ కి ఐదవ స్థానం, ఆదిరెడ్డికి నాల్గవ స్థానం దక్కింది. ఇక కీర్తి మూడవ స్థానంలో నిలిచారు. టైటిల్ పోరులో శ్రీహాన్,రేవంత్ నిలిచారు. కీలక సమయంలో నాగార్జున టెంప్టింగ్ ఆఫర్ తో వచ్చాడు. టాప్ టు కంటెస్టెంట్స్ కాంఫిడెన్స్ టెస్ట్ చేశారు. దారుణంగా ప్రైజ్ మనీలోని 80 శాతం అమౌంట్ రూ. 40 లక్షలు ఆఫర్ చేశాడు. గెలిచేది ఒక్కరే కాబట్టి, నమ్మకం లేని కంటెస్టెంట్ ఈ అమౌంట్ తీసుకొని రేసు నుండి తప్పుకోవచ్చని సలహా ఇచ్చారు.
బిగ్ బాస్ రన్నర్ కి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. రేవంత్ తనకంటే ఫేమ్, గేమ్ పరంగా టాప్ అని శ్రీహాన్ కి ఎక్కడో నమ్మకం ఉంది. అది తనపై తనకున్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. అలాగే నాగార్జున మాటలు, పేరెంట్స్, తోటి కంటెస్టెంట్స్ సలహాలు అతని మనసు మార్చాయి. ఫైనల్ గా అమౌంట్ తీసుకొని రేసు నుండి శ్రీహాన్ తప్పుకున్నాడు. దీంతో రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ కైవసం చేసుకున్నాడు. అనూహ్యంగా చివర్లో అసలు విన్నర్ శ్రీహాన్ అని నాగార్జున చెప్పడం జరిగింది. రిజల్ట్ అందరి మైండ్స్ బ్లాక్ చేసింది.

రేవంత్ విశ్వాసం విజేతను చేసింది. నాకు టైటిల్ మాత్రమే కావాలని పట్టుబట్టి సాధించాడు. రేవంత్ బిగ్ బాస్ హౌస్లో ఉండగా కూతురు పుట్టింది. కీలక సమయంలో భార్య పక్కనే ఉండి, బిడ్డ పుట్టిన క్షణాలు ఆస్వాదించే అరుదైన అవకాశం రేవంత్ కోల్పోయాడు. బిగ్ బాస్ రేవంత్ కి కూతురు పుట్టినట్లు తెలియజేశాడు. ఎమోషనల్ అయిన అతడు టైటిల్ గెలిచి కూతురు చేతికి అందిస్తాను అన్నాడు. అన్న మాట ప్రకారం టైటిల్ కొట్టి కన్న బిడ్డకు బహుమతిగా ఇచ్చాడు.రేవంత్ కేక్ కట్ చేసి ఈ హ్యాపీ మూమెంట్ ని భార్య, కూతురు, కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. రేవంత్ ఇంట్లో జరిగిన వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.