Retired IRS Samuel Prasad Case: అతడో ఎస్ఐ. శాంతి భద్రతలు పర్యవేక్షించడం అతడి విధి. అక్రమాలకు పాల్పడే వారిని శిక్షించడం అతడి ప్రధమ కర్తవ్యం.. అలాంటి ఖాకి చొక్కా వేసుకున్న అతడు కట్టు తప్పాడు.. విధి నిర్వహణలో ఆశ్రిత పక్షపాతం చూపించనని ప్రతిజ్ఞ చేసిన అతడే కట్టు తప్పాడు. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డాడు. ఫలితంగా ఓ మాజీ ఐఆర్ఎస్ అధికారికి వలపు విసిరాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు కాబట్టి.. సదరు ఎస్ఐ పలపు వల విసిరినంత మాత్రాన నిజం దాగదు కాబట్టి.. అతడి బండారం మొత్తం బయటపడింది.
వెలుగులోకి కొత్త కోణం
మాజీ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన ఆస్తిపత్రాల అపహరణ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ తవ్వుతున్న పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి. శామ్యూల్ కు వందల కోట్లల్లో ఆస్తులు ఉన్నాయి. పిల్లలు మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. గతంలో సామ్యూల్ తన భూమిలో కొంత భాగాన్ని ఎస్సై కృష్ణకు, రియల్టర్ సురేందర్ కు విక్రయించాడు. అప్పుడే శామ్యూల్ కు భారీగా ఆస్తులు ఉన్నాయని వీరిద్దరికీ తెలిసింది. ఆయన ఆస్తిని మొత్తం కాజేయాలని దుండిగల్ ఎస్సై కృష్ణ, రియల్టర్ సురేందర్ పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు గానూ ఆయన పైకి వలపు వల విసిరారు.. శామ్యూల్ కు ఒక మహిళతో పెళ్లి చేయాలని, అప్పుడు ఆమె ద్వారా ఆస్తి అంతా తమకు దక్కుతుందని ఆలోచన చేశారు.
ఒంటరి మహిళను పంపించారు
ఇందులో భాగంగా ఎస్సై కృష్ణ రెండవ భార్య అయిన పాపకు పాత నేరస్తుడైన శ్రీశైలం తో పాటు ఆశీర్వాదం అనే మరో వ్యక్తితో పరిచయం ఉంది. వీరు మొత్తం కలిసి సుమలత అనే ఒంటరి మహిళను శామ్యూల్ ఇంటిదగ్గర పనిమనిషిగా పెట్టారు. సుమలత పనిమనిషిగా చేరిన కొద్ది రోజుల తర్వాత శ్రీశైలం, ఆశీర్వాదం, సురేందర్ కలిసి శామ్యూల్ వద్ద రెండవ పెళ్లి ప్రస్తావని తీసుకొచ్చారు. ఇంట్లో పని చేస్తున్న సుమలతను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆయనకు సూచించారు. దీన్ని శామ్యూల్ తిరస్కరించారు. కొద్దిరోజుల తర్వాత ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వడం లేదని సుమలత శామ్యూల్ ఇంటిదగ్గర పని చేయడాన్ని విరమించుకుంది. దీంతో వారి పథకం బెడిసి కొట్టింది.
టిఫిన్ లో మత్తు మందు కలిపి..
ఎలాగైనా శామ్యూల్ ఆస్తి కాజేయాలనే ఆలోచనతో ఉన్న ఎస్ఐ కృష్ణ.. రియల్టర్ సురేందర్ తో కలిసి ప్లాన్ _బీకి రూప కల్పన చేశాడు. అదే శామ్యూల్ కు సురేందర్ మత్తుమందు కలిపిన టిఫిన్ తినిపించి.. ఇంట్లో ఉన్న కొంత నగదుతో పాటు ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లడం..ఆ పత్రాలను దుండిగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ కృష్ణకు అందజేశాడు.
పోలీసుల విచారణతో..
శామ్యూల్ ఇంట్లో పత్రాల అపహరణకు పాల్పడ్డ సురేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించారు. తర్వాత రెండు రోజుల్లోనే ఎస్సై కృష్ణను అదుపులోకి తీసుకొని డిసిపి ఎదుట హాజరు పరిచారు. కేసు విచారణ ముగిసే దాకా హైదరాబాదులోనే ఉండాలని, ఎప్పుడూ పిలిచినా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు..కాగా, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శ్రీశైలం, ఆశీర్వాదాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. పనిమనిషి సుమలతను విచారిస్తున్నట్టు ఎస్ఐ కృష్ణకు తెలిసింది. వారు ముగ్గురు నిజాలు చెప్తే ఈ పథకంలో తనకు, తన రెండవ భార్యకు ప్రమేయం ఉందన్న విషయం తెలిసిపోతుందని కృష్ణ ఆందోళన చెందాడు. వెంటనే తన రెండవ భార్యతో కలిసి పారిపోయాడు. ప్రస్తుతం వారిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో వైపు శామ్యూల్ ఈ కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర డిజిపిని కలిశారు. తనను ఇబ్బంది పెట్టిన కృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.