Hyderabad: ప్రాణాలు కాపాడిన పోలీసును గుర్తుపట్టి మరీ ఈ మహిళ ఏం చేసిందంటే?

ప్రస్తుతం మహంకాళి ఏసీపీ రవీందర్‌ 2014లో టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో కార్వాన్‌కు చెందిన కవితకు కడుపులో గడ్డలు ఏర్పడి నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు.

Written By: Raj Shekar, Updated On : August 28, 2023 2:02 pm

Hyderabad

Follow us on

Hyderabad: అవసరం ఉన్నంత వరకు వాడుకుని.. అవసరం తీరాక వదిలేస్తున్న రోజులు ఇవీ.. సాయం చేసిన మనిషిని.. మరిచిపోతున్న కాలమిదీ. విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రస్తుత సమాచారంలో ఓ మహిళ మాత్రం తన ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారిని మరిచిపోలేదు. సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఆ అధికారి ఎదురుకాగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. బస్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలిపింది. ఈ రోజు తాను బతికి ఉన్నానంటే మీరే కారణమంటూ అతనిపై కాళ్లపై పడి కన్నీరు పెట్టుకుంది.

ఏం జరిగిందంటే..
ప్రస్తుతం మహంకాళి ఏసీపీ రవీందర్‌ 2014లో టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో కార్వాన్‌కు చెందిన కవితకు కడుపులో గడ్డలు ఏర్పడి నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఆదుకునే వారులేక నరకయాతన అనుభవించారు. విషయం తెలుసుకున్న రవీందర్‌ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి తన సొంత ఖర్చులతో ఆపరేషన్‌ చేయించారు. తరువాత అతడు అక్కడి నుంచి బదిలీ కావడంతో విషయం మరిచిపోయారు. ఇది జరిగి తొమ్మిదేళ్లు గడిచింది.

ప్రాణదాతకు పాదాభివందనం..
రవీందర్‌ నుంచి సాయం పొందిన కవిత మాత్రం అతడిని మరిచిపోలేదు. తన సెల్‌ఫోన్‌లో ఫొటో పెట్టుకొని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఆయనకు రాఖీ కట్టాలని ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు సైతం చేసింది. ఆదివారం కవిత పని నిమిత్తం సికింద్రాబాద్‌కు బస్సులో వెళ్తుండగా.. ఆర్పీ రోడ్డులో దర్గా వద్ద ప్రస్తుతం ఏసీపీగా విధుల్లో ఉన్న రవీందరు చూసి గుర్తు పట్టింది. బస్సు కొంతదూరం వెళ్లాక సిగ్నల్‌ వద్ద ఆగాక దిగేసింది. ఆయన వెళ్లిపోతారేమోననే ఆందోళనతో పరుగులు పెట్టింది. రవీందర్‌ వద్దకు చేరుకుని దండం పెట్టింది. ఆయన మాత్రం గుర్తు పట్టలేదు. ఎవరమ్మా మీరు అని అడగడంతో తనను తాను పరిచయం చేసుకుంది. ఆనందంతో కన్నీళ్లు కార్చింది. పాదాభివందనం చేసింది. ‘సార్‌.. మీకు వెండి రాఖీ తీసుకొచ్చి కడతాను. ఫోన్‌∙నంబరు ఇవ్వండి’ అంటూ అడిగి తీసుకొని వెళ్లిపోయింది.

హృదయాలను కదిలించింది..
తొమ్మిదేళ్ల క్రితం చేసిన సాయాన్ని మర్చిపోకుండా కవిత పోలీస్‌ ఆఫీసర్‌ను దైవంగా కొలుస్తూనే ఉంది. తన ప్రాణాలు నిలవడానికి ఆయనే కారణం కావడంతో అతడే దేవుడు అనుకుంటుంది. ఈక్రమంలో పోలీస్‌ అధికారి వద్దకు వచ్చి పాదాభివందనం చేయడం అక్కడున్నవారిని కదిలించింది. పోలీసుల హృదయాలు కాఠిన్యం అంటారు. కానీ, ఇలాంటి మంచి పోలీసులు కూడా ఉంటారని అక్కడున్నవారు అనడం గమనార్హం. హ్యాట్సాప్‌ ఏసీపీ రవీందర్‌ సార్‌..!