Kambala: ఒక సంస్కృతి మరుగున పడుతున్నప్పుడు దానిని జనంలోకి మరింతగా తీసుకెళ్లాలంటే ఒక బలమైన మాధ్యమం అవసరం. అలాంటి మాధ్యమం ద్వారా కంబాళా అనే క్రీడ, వరాహ రూపం అనే పూజా విధానం ప్రపంచానికి తెలిసింది.. దానివల్ల కన్నడ సొగసు విశ్వవ్యాప్తమైంది. సాక్షాత్తు కర్ణాటక ప్రభుత్వం వరాహ రూపం ఆడే వారికి పింఛన్ కూడా ఇస్తోంది.. సరే ఇదంతా ఒడిసిన ముచ్చట. కాంతారా కూడా ఓటీటీలో విడుదలైంది. కర్ణాటకలో అక్కడక్కడ షో లు పడుతున్నాయి. రీల్ కాంతారా దాదాపు ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. కానీ రియల్ కంబాళా ఇప్పుడే మొదలుకానుంది. కాంతారాకు, కంబాళా కు అవినాభావ సంబంధం ఉంది. రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో కంబాళా పోటీలో పాల్గొంటాడు. వరాహ రూపం కంటే ప్రేక్షకులను మొదట మైమరిదింప చేసింది ఇదే. గత ఏడాది ఇదే సమయంలో కంబాళా పోటీల గురించి మీడియా పదేపదే రాసింది. ఎందుకయ్యా అంటే ఆ పోటీలో ఓ పోటీదారు పరుగుల వీరుడు, ఒలంపిక్ లెజెండ్ ఉసెన్ బోల్ట్ రన్ ను బ్రేక్ చేశాడు.. అయితే ఆ రన్ టైమును సరిగా లెక్కించలేదని ఒక ఆరోపణ కూడా ఉంది. వాస్తవానికి ఈ పోటీలను కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.. సేమ్ తమిళనాడులో జల్లికట్టు, కేరళలో వల్లం కల్లి పోటీలు ఎంత ఫేమసో…కంబాళా కూడా కర్ణాటక కోస్టల్ బెల్ట్ లో అంతే ఫేమస్.

ఆసక్తికరమైన కథ
కంబాళా పోటీల వెనుక చారిత్రాత్మక నేపథ్యం ఉంది.. వీటిని హొయసల రాజులు ప్రారంభించారు. ఈ పోటీల్లో దృఢంగా నిలిచి, వేగంగా పరుగు తీయగల, సామర్థ్యం ఉన్న దున్నపోతులను అవసరమైతే యుద్ధంలో వినియోగించుకోవాలని ఆ రాజుల ప్లాన్.. రాజ కుటుంబీకులకు అది మంచి క్రీడా వినోదం కూడా. తర్వాత రాజ్యాలు అంతరించాక.. కొన్నాళ్లపాటు వాటిని ఆంగ్లేయులు నిర్వహించారు.. కాలక్రమేణా ఇప్పుడు ఆ పోటీలను రైతులే నిర్వహించుకుంటున్నారు.. అలాగని ఈ కల్చర్ కర్ణాటక మొత్తం ఉండదు.. కేవలం కోస్తా ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల సీజన్ కాబట్టి ప్రజల మన భావాలను నొప్పించకుండా ప్రభుత్వం అధికారికంగా కంబాళా పోటీల షెడ్యూల్ విడుదల చేసింది. కంబాళా కేవలం పోటీల మాదిరే ఉండదు. ఇందులో కొంచెం ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. కర్ణాటకలో శివుడిని మంజునాధుడిగా కొలుస్తారు. పోటీలను కద్రి మంజునాధుడికి అంకితం ఇస్తారు. సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో రైతులే స్వయంగా కంబాళా పోటీలు నిర్వహించడం నిజంగా విశేషమే. అయితే ఈ పోటీల్లో భారీ భారీ బహుమతులు ఉండవు.. చిన్న చిన్న కానుకలను, నగదు బహుమతిని అందజేస్తారు. అలాగే పోటీల్లో గెలుపొందిన దున్నలకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుంది. వాటి వీర్యానికి భారీ డిమాండ్ ఉంటుంది.. సేమ్ మన హైదరాబాదులో జరిగే సదర్ పండుగలాగా అన్నట్టు.

పోటీల నిర్వహణ పూర్తి విభిన్నం
కాంతారా లో చూపించినట్టే కంబాళా పోటీలు ఉంటాయి. చట్టంగా బురద మట్టి, దృఢమైన దున్నపోతులు, వాటితోపాటు పరుగు తీయటం… ఇంగ్లీష్ పరి భాషలో చెప్పాలంటే దున్నపోతులను పట్టుకున్న వ్యక్తి జాకీ మాదిరి వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ఈ పోటీలను పంటలు చేతికి వచ్చిన తర్వాత రైతులు జరుపుకుంటారు.. కాంతారా సినిమా పుణ్యమా అని ఈసారి పోటీలకు విశేష ప్రాచుర్యం లభించింది. కర్ణాటక పర్యాటకశాఖ ఈ పోటీలను బాగా ప్రమోట్ చేస్తోంది. ఏకంగా షెడ్యూల్ కూడా విడుదలకు చేసింది. ఈ ఏడు ఎన్నికల సీజన్ కావడంతో పోటీలు కూడా రాజకీయ రంగు పులుముకున్నాయి.