Ravindra Jadeja Wife Rivaba: రవీంద్ర జడేజా.. పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా ఆల్ రౌండర్లలో ఏక్ నంబర్ ఇతడు. ఇతడికి గాయం కావడం వల్లే జట్టు సమతుల్యం దెబ్బతిని ఆసియాకప్ లో టీమిండియా ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్ లోనూ ఇదే కొనసాగి కప్ కొట్టలేక భారత్ తిరుగుముఖం పట్టింది. ఇప్పుడు జడేజా స్థానంలో ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ ఫరవాలేదనిపిస్తున్నా రవీంద్ర జడేజా అంత గొప్ప ఆల్ రౌండర్ అయితే అతడు కాడు.

అయితే మోకాలి ఆపరేషన్ చేయించుకున్న రవీంద్ర జడేజా నిజానికి బంగ్లాదేశ్ తో వన్డే, టెస్ట్ సిరీస్ కు ఎంపియ్యాడు. అక్కడ ఆడాల్సి ఉంది. పూర్తి ఫిట్ నెస్ కూడా సాధించాడు. కానీ ఇదే సమయంలో గుజరాత్ ఎన్నికలు వచ్చాయి. ఆయన భార్య రివాబా జడేజా ఈసారి జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానానికి పోటీపడుతోంది. అధికార బీజేపీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. భార్యను ఎన్నికల్లో ఒంటరిగా వదిలేసి బంగ్లాదేశ్ కు వెళ్లడానికి రవీంద్ర జడేజా సాహసం చేయలేదు. అందుకే బీసీసీఐ బాస్ గా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా సహాయం కోరాడని టాక్.
గుజరాత్ లో గెలుపు కోసం ఏమైనా చేసే అమిత్ షా ఆయన కొడుకు జైషా వెంటనే బంగ్లాదేశ్ టూర్ నుంచి రవీంద్రజడేజాకు మినహాయింపునిచ్చారు. పైకి జడేజా గాయం తగ్గలేదని ప్రకటన ఇచ్చారు. కానీ రవీంద్ర జడేజా మాత్రం మోకాలి గాయం అని పైకి చెప్పినా భార్యతో కలిసి జామ్ నగర్ వీధులంతా ప్రచారం చేశాడు. ఆమె గెలుపునకు సహకరించాడు.గుజరాత్ లో బీజేపీ గాలి వీయడంతో జడేజా భార్య కూడా ఆ ఊపులో గెలిచేసింది.

ఇదివరకూ ఈ సీటులో బిజెపికి చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు ధర్మేంద్రసింగ్ జడేజా పోటీచేశారు. అతడిని పక్కన పెట్టి మరీ జడేజా భార్య రివాబాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అందుకే జడేజా బంగ్లాదేశ్ టూర్ పక్కనపెట్టి మరీ తన సొంత ప్రయోజనాల కోసం భార్యను ఎన్నికల్లో గెలిపించుకున్నారు.
ఇప్పుడు దీన్నే బేస్ చేసుకొని నెటిజన్లు రెచ్చిపోతున్నారు. సరైన టీంలేక బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. కీలక ఆటగాళ్లు దూరమైన వేళ తేలిపోయింది. దీంతో ‘టీమిండియాను ఓడించాడు.. భార్యను ఎన్నికల్లో గెలిపించాడు..’ అని రవీంద్ర జడేజాపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భార్య గెలుపుకోసం దేశాన్ని తాకట్టు పెట్టాడని విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్ లాంటి పసికూన చేతిలో టీమిండియా ఓడిపోవడానికి జడేజాను కారణంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.