Hanuma Vihari: హనుమ విహారి.. ఈ తెలుగు క్రికెటర్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.. భారత జట్టు తరఫున టెస్టుల్లో ఆడుతూ మంచి పేరు సంపాదించాడు.. నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు.. ఆట అంటే తనకు ఎంత మక్కువో పలు సందర్భాల్లో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ చేసే సమయంలో విహారి తన గాయాన్ని కూడా లెక్క చేయడు.. గతంలో వెన్ను నొప్పితో ఇబ్బంది పడితే కూడా టీం ఇండియా తరఫున చివరి వరకు పోరాడి మ్యాచ్ ను డ్రా చేశాడు. ఇప్పుడు మరోసారి కూడా అదే పని చేశాడు.. ఆంధ్ర కెప్టెన్ అయిన హనుమ విహారి మణికట్టు గాయం లెక్కచేయకుండా బ్యాటింగ్ చేశాడు.

రంజి ట్రోఫీ 2022_23 సీజన్లో భాగంగా మధ్యప్రదేశ్, ఆంధ్ర జట్ల మధ్య మంగళవారం (జనవరి 31) క్వార్టర్ ఫైనల్ పోరు మొదలైంది.. ఈ మ్యాచ్లో ఆంధ్ర జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. తొలి రోజు ఆటలో హనుమ విహారి 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడి ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.. పేసర్ ఆవేష్ ఖాన్ వేసిన బంతి విహారి ఎడమచేతి మణికట్టు కు బలంగా తాకింది.. నొప్పితో విలవిలలాడుతూ అతడు రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు.. రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల అనంతరం ఆంధ్ర ఆటగాళ్లు పెవిలియన్ చేరారు.
ఆంధ్ర జట్టు 30 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చే జార్చుకుంది.. ఈ దశలో మణికట్టు ఫ్రాక్చర్ సైతం లెక్కచేయకుండా హనుమ విహారి బరిలోకి దిగాడు.. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన విహారి లెఫ్ట్ హ్యాండర్ గా బరిలోకి దిగాడు.. మణికట్టుకు గాయం కాకుండా ఉండేందుకు లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేశాడు.. మొత్తంగా 57 బంతుల్లో 27 పరుగులు చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.. విహారి భయ్యా సూపర్ నిజమైన పోరాట యోధుడివి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

విహారి ఇన్నింగ్స్ తో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ లో 379 పరుగుల స్కోర్ చేసింది.. రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఏపీ తొలి స్కోరు కు ఇంకా 235 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్(20), హిమాన్షు (22), రజత్ (22) త్వరగానే అవుట్ కాగా… శుభం శర్మ హాఫ్ సెంచరీ చేశాడు.. అయితే ఆటపై ఇంతటి డెడికేషన్ ఉన్న విహారికి ఈ నెలలో స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ లో చోటు దక్కకపోవడం గమనార్హం.