
Ranga Maarthaanda Pre Release Review: కొన్ని సినిమాలు మన నిజ జీవితం లో జరిగే సంఘటనలకు దర్పణం లాగ ఉంటాయి.వాటిని చూసినప్పుడు మనకి కూడా ఇలాగే జరిగింది కధా అని తలచుకొని బాధపడుతాము. ఇలాంటి సినిమాలు కచ్చితంగా రావాలి. రీసెంట్ గానే తెలంగాణ సంస్కృతి ని ఆధారంగా తీసుకొని కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ‘బలగం’ అనే చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలంగాణ బాషా , యాస, సంస్కృతి ఇలా ఉంటుందా, తెలంగాణ గ్రామాల్లోకి వెళ్తే ఇంత అద్భుతంగా ఉంటుందా. ఒక్కసారి అక్కడకి వెళ్ళాలి అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతాది.అంత అద్భుతంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు వేణు. ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ కూడా అలాంటి సినిమాతోనే మన ముందుకి వస్తున్నాడు. ఆయన తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ అనే సినిమా ఉగాది కానుకగా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖుల కోసం డైరెక్టర్ కృష్ణ వంశీ ఒక ప్రత్యేక ప్రీమియర్ షో ని ఏర్పాటు చేసాడు.ఈ ప్రీమియర్ షో నుండి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.
కథ :
నాటక రంగాన్ని తన ఊపిరి లాగా భావించే ఒక రంగస్థల నటుడు (ప్రకాష్ రాజ్) తన జీవిత చివరి అంకం లో నటన నుండి శాశ్వతంగా తప్పుకుంటాడు.నాటకాల ద్వారా ఇన్ని రోజులు ఆయన సంపాదించిన డబ్బు మరియు ఆస్తిని ఎలాంటి స్వార్థం లేకుండా తన కొడుకు మరియు కూతురికి రాసి ఇచ్చేస్తాడు. ఆధునిక ప్రపంచం లో బ్రతికే కొడుకు,కూతురు,కోడలు మరియు అల్లుడు వల్ల ఎలాంటి అవమానాలకు ఈ వృద్ధ దంపతులు( ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ) గురి అయ్యారు. జీవితం లో ఎలాంటి సమస్యలు ఎదురైనా కష్టసుఖాలలో పాలు పంచుకునే స్నేహితుడు (బ్రహ్మానందం) వల్ల ఈ వృద్ధ దంపుతుల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనేదే కథ.
విశ్లేషణ:
డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమా ద్వారా మన రోజువారీ జీవితాలలో చూస్తున్న సంఘటనలు మరియు భావోద్వేగాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆ తెరక్కించిన ప్రతీ సన్నివేశం కూడా అడ్డం లో మన జీవితాలను చూసుకున్నట్టే ఉంటుంది. ఇది వరకు ఆయన ఎన్నో ఫ్యామిలీ సినిమాలు తీసి ఉండొచ్చు, ఎన్నో రొమాంటిక్ సినిమాలు కూడా తీసి ఉండొచ్చు. కానీ ‘రంగమార్తాండ’ సినిమా మాత్రం ఆయన కెరీర్ లో ఎన్నడూ మర్చిపోలేని సినిమాగా నిలుస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా?, ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేసే ప్రకాష్ రాజ్ రంగమార్తాండ రాఘవరావు గా ఈ సమాజం లో ఎదురుకుంటున్న ప్రతీ తండ్రి ఆవేదనని వెండితెర మీద తన అద్భుతమైన నటనతో ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించాడు. ఇక ఆయన భార్య గా నటించిన రమ్య కృష్ణ ఆత్మాభిమానం కి ప్రతీక గా ఉండే పాత్రని ఎంతో అద్భుతంగా చేసింది. ఇక మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినది బ్రహ్మానందం గురించి. ఆయన సినీ జీవితం లో ఎన్నడూ చేయనటువంటి అద్భుతమైన పాత్ర ఇది. చక్రపాణి గా ఆయన పలికించిన హావభావాలను అవార్డులతో పోల్చలేము. ఇన్నిరోజులు మన అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈ హాస్య బ్రహ్మ, ఇప్పుడు ఈ చిత్రం తో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా చేసాడు.
చివరి మాట:
చివరగా చెప్పేది ఏమిటంటే రంగమార్తాండ అనేది సినిమా కాదు, ఒక జీవితం.సమాజం లో నిద్రపోతున్న మానవత్వాన్ని కొరడాతో కొట్టి లేపినట్టు ఉంటుంది ఈ సినిమా.ఎన్నో కుటుంబాలను వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలకు దర్పణం లాగ నిలిచే ఈ రంగమార్తాండ సినిమా ప్రతీ ఒక్కరు కచ్చితంగా చూడాల్సిందే.మంచి సినిమా ఇవ్వాలని కోరుకునే ప్రేక్షకులు మంచి సినిమాని ఇచ్చినప్పుడు ఆదరిస్తారో లేదో అనేది రేపటితో తెలిసిపోతాది.
రేటింగ్ : 3 / 5