
Ramcharan: అమెరికాలో రామ్ చరణ్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఆయన విశిష్ట పురస్కారాలు దక్కించుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆయన్ని గ్లోబల్ స్టార్ చేసింది. హాలీవుడ్ సంస్థలు, దర్శకులు ఆయనతో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ హాలీవుడ్ మూవీ చేస్తారా? అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన ‘టాక్ ఈజీ’ అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ ఫేమ్ రాబట్టారు? హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా? అని రామ్ చరణ్ ని అడగం జరిగింది.
టెర్మినేటర్, గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్ నా ఫేవరెట్ చిత్రాలు. ఒక నటుడిగా ఇతర దేశాల చిత్రాల్లో నటించాలనే కోరిక ఉంది. ప్రస్తుతం కొన్ని చర్చల దశలో ఉన్నాయి. త్వరలో నేను నటించే మొదటి హాలీవుడ్ చిత్రంపై ప్రకటన వస్తుంది. నాకు జూలియా రాబర్ట్స్ అంటే వల్లమాలిన అభిమానం. ఆమెతో చిన్న గెస్ట్ రోల్ చేసే అవకాశం వచ్చినా ఆనందంగా చేస్తాను… అని రామ్ చరణ్ అన్నారు. హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేయగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఈ అవకాశం దక్కించుకున్న హీరోగా ఆయన రికార్డులకు ఎక్కనున్నారు. రామ్ చరణ్ హాలీవుడ్ మూవీలో నటించడం ద్వారా గ్లోబల్ స్టార్ బిరుదు సార్ధకం చేసుకోనున్నారు. మెగా వారసుడిగా తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడిగా మరిన్ని కీర్తి శిఖరాలకు ఆయన చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్… హాలీవుడ్ మూవీలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు. కొద్దిరోజులకే చర్చలు జరుగుతున్నాయి, త్వరలో ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
ఒక నెల రోజులుగా అమెరికాలో ఉంటున్న రామ్ చరణ్ తో హాలీవుడ్ మేకర్స్ భేటీ అవుతున్నారని, ఆయనకు స్క్రిప్ట్స్ వినిపిస్తున్నారని అర్థమవుతుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ ఇండియన్ సినిమా గౌరవాన్ని పెంచే నటుడు అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్… దర్శకుడు శంకర్ తో ఒక చిత్రం చేస్తున్నారు. చరణ్ 15వ చిత్రంగా తెరకెక్కుతుండగా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఒక మూవీ ప్రకటించారు.