Homeఎంటర్టైన్మెంట్Balagam Movie Song: ‘బలగం’ పాట రివ్యూ : ఇది గోల్డెన్ గ్లోబ్ నాటు కాదు:...

Balagam Movie Song: ‘బలగం’ పాట రివ్యూ : ఇది గోల్డెన్ గ్లోబ్ నాటు కాదు: అచ్చమైన తెలంగాణ నాటు

Balagam Movie Song
Balagam Movie Song

Balagam Movie Song: ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవచ్చు గాక.. ఆస్కార్ కోసం ఆ సినిమా బృందం రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు గాక.. కానీ ఆ పాటలో తెలంగాణ చరిత్రను రకరకాలుగా వక్రీకరించారు.. తెలంగాణ సంస్కృతికి విభిన్నమైన భాష్యాలు చెప్పారు. అన్నట్టు ఆ పాట రాసింది చంద్రబోస్. వరంగల్ వాసి… అయినప్పటికీ తెలంగాణ చరిత్రను కొత్తగా చూపించలేకపోయాడు.

వాస్తవానికి జీవనదిలా సాగే ఒక ప్రాంత మాలికాన్ని పట్టుకోవాలి అంటే ఆ ప్రాంత సంస్కృతి ఏమిటో తెలియాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆవాహన చేసుకోవాలి.. అనుభవించాలి. అక్షరీకరించాలి. అప్పుడు అది ఆ మట్టి పరిమళాల్ని మోసుకొస్తుంది. ఒక చిత్తూరు యాస, ఒక రాయలసీమ గోస, ఒక ఉత్తర కోస్తా ధ్యాస, ఒక తెలంగాణ భాషలో పాట రాయాలంటే ఆ పదాల విరుపు పట్టుకోవాలి. అలా రాయకూడదంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటలా ఉండ కూడదు. అది సంకరభాష. నిజాం కాలం నాటి తెలంగాణ భాష అంటూ చంద్రబోస్ ఏదో ఒక కృతక సమర్థనకు దిగి మరింత అవాస పాలయ్యాడు. తెలంగాణ తనం జీర్ణించుకున్న వాడు రాసే పాట కాదు అది. అది ఆస్కార్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే అది తెలంగాణ మాండలికం కోణంలో మృత గీతమే.

ఆ సినిమా పేరు బలగం.. నిర్మిస్తోంది దిల్ రాజు. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి కాసర్ల శ్యామ్ ఒక పాట రాశాడు.. పాడింది మిర్యాల రామ్.. మంగ్లీ. పాట వింటుంటే తెలంగాణ మాండలికాన్ని చేతితో తడిమినట్టు ఉంది.. ఈ పాటకు మంగ్లీ గొంతు సరిపోలేదు.. ఈ పాటకు సంగీత దర్శకుడు భీమ్స్. తను కూడా తెలంగాణ వాడే.

Balagam Movie Song
Balagam Movie Song

ఎందుకు ఈ పాట గురించి చెప్పాలి అనిపించిందంటే గోల్డెన్ గ్లోబ్ వాడికి చంద్రబోస్ రాసిన తెలంగాణ ఏం అర్థమైంది? ఆ పాట ఆస్కార్ దాకా ఎలా వెళుతున్నది? ఏమోలే ఈ బలగం పాటకు వస్తే ఓ పల్లె జీవనం గురించి రాసిన పాట. ఇందులో కూడా నాన్ తెలంగాణ పదాలు కొన్ని పడ్డాయి. నీ పాసుగాల, అమ్మ తీరు, కన్న కూతురు, ఎదుగుతున్న పంట పైరు, తుల్లేటి జెల్ల శాపోలే,మావి పూత..

కానీ ఈ తెలంగాణ రచయిత ఇప్పటిదాకా వాడని కొన్ని అచ్చ తెలంగాణ పదాలు వాడినట్టు కనిపిస్తోంది. కేవలం పదాలే కాదు, కంటెంట్ లోనూ సాహిత్య స్పృహ ఉంది.. ఉదాహరణకు రాలుతున్న పూల చప్పట్లు, రంగుల సింగిడి పల్లె, గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోని జంటగా మోగుతూ ఉంటాయి రా, బాయి గిరక నా పల్లె… అలాగే పాలధారలల్ల పల్లె తెల్లారుతున్నదిరా, సదరి సెప్పలేని మొగని తిప్పలు, వచ్చిపోయేటోల్ల మందలించుకునే సంగతి గమ్మతి ఇలాంటి పదాలు పాటలో అందంగా అమిరాయి.. అన్నట్టు ఈ పాటను తెలంగాణ కవులుగా, సరికొత్త భాషకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్న వ్యక్తులుగా చెప్పుకుంటున్న ఆ నాటు చంద్ర బోస్, సారంగ దరియా సుద్దాల అశోక్ తేజ, అడ్డగోలు పదాలు రాసే అనంత్ శ్రీరామ్ ఈ పాట ఒక్కసారి వినాలి. అసలైన తెలంగాణ కారం నాలుకకు తగులతది . ఎమన్నా తిమ్మిరి గిమ్మిరి ఉంటే ఇచ్చకపోతది. పాట అంటే పదాల అల్లిక కాదు. అనువైన సాహిత్యాన్ని జనంలోకి తీసుకుపోవటం…

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular