Ponniyin Selvan: రాజులు పోయారు.. వారి రాజ్యాలు పోయాయి. కానీ వారు నెలకొల్పిన వైభవం మాత్రం ఇంకా మన కళ్లముందే ఉంది. నాటి రాజులు కట్టించిన కోటలు, శిల్పాలు, దేవాలయాలు వారి గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. పాండ్యాలు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం ఇలా ఎంతోమంది రాజులు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను గొప్పగా పరిపాలించారు. వారి కథలు సినిమాలుగానూ వస్తున్నాయి.
ప్రస్తుతం తమిళంలో రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్’ (పీఎస్1) కూడా అలాంటి కథనే. తమిళ అగ్రహీరోలు, అగ్ర హీరోయిన్లు కలిసి చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతోంది. దీన్ని తీసింది ఎవరో కాదు.. గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ ‘మణిరత్నం’. ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ చిత్రాలు తీసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత ఫెయిడ్ అవుట్ అయిపోయినా.. ఆయన క్లాస్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అసలు ఈ కథేంటి? ఇందులోని పాత్రలు ఏంటి? ఈ రాజుల పాత్రల్లో ఎవరెవరు నటించారనే విషయాన్ని తెలుసుకుందాం.
దక్షిణ భారతదేశాన్ని ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాన్ని పాలించిన రాజుల్లో ‘చోళులు’ ముఖ్యులు. చోళ రాజుల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ‘కల్కి కృష్ణమూర్తి’ రాసిని పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగానే మణిరత్నం ఈ భారీ చారిత్రక చిత్రాన్ని తీశారు. ఈ సినిమాలో తమిళ అగ్రహీరోలు విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్యరాజ్, త్రిష ఇలా పలువురు స్టార్ హీరో హీరోయిన్లు నటించడంతో దేశవ్యాప్తంగా దీనిపై బజ్ నెలకొంది.
-సుందర చోళుడుగా ప్రకాష్ రాజ్
చోళ సామ్రాజ్యానికి రాజు సుందర చోళుడు. ఈ పాత్రను ప్రకాష్ రాజ్ పోషించాడు. ఇతడు అనారోగ్యంతో మంచం పట్టడంతో అతడి ముగ్గురు సంతానం రాజు కోసం పోటీపడుతారు.
-ఆదిత్య కరికాలన్ గా విక్రమ్
సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) పెద్ద కుమారుడిగా చోళ సామ్రాజ్యపు యువ రాజు ఆదిత్య కరికాలుడుగా పాత్రను హీరో విక్రమ్ పోషించాడు.
-అరుళ్ మోళి వర్మన్ గా జయం రవి
సుందరచోళుడి చిన్న కుమారుడు అరుళ్ మోళి వర్మన్ పాత్రలో హీరో జయం రవి నటించాడు. ఇతడినే పొన్నియన్ సెల్వన్ అంటారు. చోళ సామ్రాజ్యపు తర్వాతి రాజుగా ప్రజలు భావిస్తారు. కథలో ప్రధాన పాత్రధారి జయం రవినే..
-వల్లవరామన్ వందిదేవన్ గా హీరో కార్తి
చోళ సామ్రాజ్య యువరాజు ఆదిత్య కరికాలన్ (విక్రమ్)కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడిగా వల్లవరామన్ వందిదేవన్ పాత్రలో హీరో కార్తి నటించాడు. చోళులకు విధేయుడిగా ఉండే వన తెగకు చెందిన వాడు.
-నందిని గా ఐశ్వర్యరాయ్
పొన్నియన్ సెల్వన్ సినిమాలో విలన్ ఛాయలున్న పాత్ర నందినిని ఐశ్వర్యరాయ్ పోశించారు.చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్ కు భార్యగా నటించారు.
-కుందవై
చోళుల రాజకుమారి కుందువైగా త్రిష నటించారు. రాజనీతిజ్ఞత గల పాత్రను పోషించింది. రాజకుమారిగా తనదైన శైలిలో ఈ రాజకీయంలో పాలుపంచుకుంటుంది.
-పెరియ పళవేట్టురాయర్
చోళ సామ్రాజ్యానికి కోశాధికారిగా పెరియా పళవేట్టురాయర్ పాత్రలో నటుడు శరత్ కుమార్ నటించాడు. ఇతడు చోళుల సామ్రాజ్యానికి నమ్మకస్తుడిగా నటించాడు.
-చిన పళ వేట్టురాయర్
తంజావూరు కోటకు సేనాధిపతిగా చిన పళవేట్టురాయర్ గా ఆర్.పార్తిబన్ అనే నటుడు నటించాడు.
-పూంగుళాలి
వల్లవరామన్ వందిదేవన్ (కార్తి) ప్రాణాలు కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయే పూంగుళాలి పాత్రలో లక్ష్మీమేనన్ నటించారు.
–ఆళ్వార్ కడియాన్ నంబి
చోళ సామ్రాజ్యపు గూఢచారి ఆళ్వార్ కడియాన్ నంబి పాత్రలో జయరామ్ నటించాడు. చోళ రాజ్యాన్ని కాపాడే క్రమంలో ప్రధాని అనిరుద్ధ బ్రహ్మయ్యార్ కోసం పనిచేస్తుంటాడు.
వీరే కాకుండా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇంకా వీరపాండ్యన్ గా నాజర్, పార్ధిబేంద్ర పల్లవన్ గా విక్రమ్ ప్రభు, వానతిగా తెలుగు నటి శోభిత దూళిపాళ, సెంబియన్ మహాదేవిగా జయచిత్ర, మధురాంతకుడిగా రెహమాన్ లు కీలక పాత్రలు పోషించారు.
మరి ఎంతో పెద్ద తారగణం ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరున విడుదల అవుతోంది. ఈ చారిత్రక చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్య, త్రిష లాంటి బలమైన తారాగణంతోపాటు మణిరత్నం దర్శకత్వం, రెహమాన్ మ్యూజిక్ కావడంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవి అందుకుంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.