Homeఆంధ్రప్రదేశ్‌Politics Lookback 2024: 2024 గేమ్ చేంజర్స్: తెలుగు రాష్ట్రాల్లో జనాల నోళ్లల్లో తెగ నానింది...

Politics Lookback 2024: 2024 గేమ్ చేంజర్స్: తెలుగు రాష్ట్రాల్లో జనాల నోళ్లల్లో తెగ నానింది వీరే..

Politics Lookback 2024: తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను కొంతమంది శాసించారు. 2024లో వారు మాత్రమే ముందు వరసలో నిలిచారు. తెర ముందు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నప్పటికీ.. వారందరినీ కాదని వీరు మాత్రమే ముందు వరుసలో ఉన్నారు. తమ వాగ్దాటితో.. వ్యూహ చతురతతో.. రాజకీయ యోధులను మట్టి కరిపించారు. ఇక సినిమా రంగంలోనూ కొంతమంది నటులు అదరగొట్టారు. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బయట జరిగే విషయాల ద్వారా వారు కూడా జనాల మదిలో విపరీతంగా మెదిలారు.

రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ.. పది సంవత్సరాలు పాటు అధికారానికి దూరంగా ఉంది. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఊపు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియాగాంధీని తెలంగాణ రాష్ట్రానికి రప్పించి.. ప్రజల మెప్పు పొందేలా చేశారు. బలమైన భారత రాష్ట్ర సమితిని 2023లో ఓడించిన ఆయన.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో చెప్పినట్టుగానే సున్నాకు పరిమితం చేశారు. కెసిఆర్ లాంటి దిగ్గజ రాజకీయ నాయకుడికి తన వ్యూహ చతురతతో చుక్కలు చూపిస్తున్నారు. కేటీఆర్ ను అష్టదిగ్బంధనం చేసే ప్లాన్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని షాక్ లు ఇస్తూ.. విజయవంతంగా ఏడాదిపాటు తన పరిపాలనలను పూర్తి చేసుకున్నారు. ఇందులో రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ.. ఎన్నో ఆరోపణలు వినిపించినప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం అటు సీనియర్లను.. ఇటు అధిష్టానాన్ని కలుపుకుంటూ.. తన పదవి కాలానికి డోకా లేకుండా చూసుకుంటున్నారు. వచ్చే కాలంలో ఎలాంటి అద్భుతాలు చేస్తారో తెలియదు గానీ.. ఇప్పటికైతే పర్వాలేదు అనే స్థాయి నుంచి.. మెరుగ్గా వద్దనే స్థాయికి తన పరిపాలనను తీసుకెళ్తున్నారు.

పవన్ కళ్యాణ్

చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైల్లో వేసినప్పుడు.. అన్నింటికీ తెగించి పవన్ కళ్యాణ్ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అక్కడే కూటమికి నాంది పలికారు. కూటమిలోకి భారతీయ జనతా పార్టీని వ్యూహాత్మకంగా తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీకి అవసరమైన పార్లమెంట్ సభ్యులను పవన్ కళ్యాణ్ అందించారు. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు కారణమయ్యారు. తన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోట విజయం సాధించే విధంగా కృషి చేశారు. మొత్తంగా 100% ఫలితాలను రాబట్టిన పార్టీగా జనసేనను నిలిపారు. పరిపాలనలోను తనదైన మార్క్ ప్రదర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభిమానాన్ని పొందుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన కొంతమంది పై కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వం ఏకంగా చట్టాలకు పదును పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ తన గొంతు సవరించారు. దీంతో సోషల్ మీడియాలో ఆకృత్యాలు తగ్గిపోయాయి. గతంతో పోల్చితే సామాజిక మాధ్యమాలలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారి సంఖ్య పూర్తిగా పడిపోయింది. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూనే.. తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

అల్లు అర్జున్

దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పుష్ప -2 సినిమా ద్వారా అల్లు అర్జున్ ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. పుష్ప పార్ట్ 1 లో ఆయన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నాడు. పుష్ప -2 లోనూ అదే రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయన అరెస్టు వ్యవహారం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. చివరికి ఆయనకు బైయిల్ లభించడంతో.. జైలు నుంచి విడుదలయ్యారు. సుమారు 16 గంటల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఆయన నోరు మెదపకపోయినప్పటికీ.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల అల్లు అర్జున్ తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే క్రమంలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపడుతుంటే.. ఒక మహిళ మరణానికి కారణమైన వ్యక్తిని ఉపేక్షించేది లేదంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. స్థానంలో ఎవరు ఉన్నా ఇలానే వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.

మోహన్ బాబు

విలక్షణ నటుడిగా పేరుపొందిన మోహన్ బాబు.. తన కుటుంబంలో జరిగిన వ్యవహారం వల్ల ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ప్రతినిధిపై దాడికి దిగడంతో ఆయన పై కేసు నమోదయింది. చివరికి ఆ న్యూస్ ఛానల్ ప్రతినిధి వద్దకు మోహన్ బాబు నేరుగా వెళ్లి క్షమాపణ చెప్పారు. ఈ ఘటన కంటే ముందు మోహన్ బాబు కుటుంబంలో అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ పోలీసులకు వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబంలో నెలకొన్న వివాదాలు కొద్ది రోజులపాటు మీడియాలో సంచలనంగా మారాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular