
Kurnool: అనుమానాలు, అపోహలు మనిషిలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నాయి. కసాయిగా మారుస్తున్నాయి. సాటివారి ప్రాణాలు తీసేలా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ కర్నూల్ జిల్లాలో జరిగిన జంట హత్యలు. సున్తీ చేయిస్తే సామర్థ్యం తగ్గిపోతుందన్న అపోహ ఇద్దరి ప్రాణాలు తీసింది. చదువు రానివాడు అపోహ పడడంలో అర్థముంది. కానీ ఇక్కడ ఉన్నత చదువు చదివిని యువకుడు కూడా తండ్రి చెప్పిన అపోహనే నిజమనుకున్నాడు. తండ్రితో కలిసి భార్య, అత్తను పొట్టన పెట్టుకున్నాడు.
పెళ్లికి ముందు నుంచే అనుమానాలు..
నంద్యాలకు చెందిన వరప్రసాద్, కృష్ణవేణి దంపతులు 30 ఏళ్ల కిందట కర్నూలు వచ్చి చింతల మునినగర్‌లో స్థిరపడ్డారు. వీరి ఏకైక కుమారుడు శ్రావణ్‌కుమార్ బీటెక్ చదివి ఏడాదిగా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో వనపర్తిలో స్థిరపడిన వంట మాస్టర్ కొత్త వెంకటేశ్, రమాదేవి దంపతుల ఏకైక కుమార్తె రుక్మిణితో సంబంధం కుదిరి పెళ్లి నిశ్చయమైంది. శ్రావణ్‌కుమార్ ఆమెకు ఓ సెల్‌ఫోన్ కానుకగా ఇచ్చాడు. అతను సదరు సెల్‌ఫోన్‌లో ఓ నిఘా యాప్‌ను నిక్షిప్తం చేసి తన ఇ–మెయిల్‌కి అనుసంధానం చేసుకున్నాడు. రాఘవేంద్రగౌడ్ అనే యువకుడికి ఆమె పలుమార్లు ఫోన్ చేస్తున్నట్లు ఇతనికి సమాచారం వచ్చింది. అనుమానిస్తున్న క్రమంలోనే మార్చి 1న ఇద్దరికీ పెళ్లి జరిగింది.
ఇన్‌ఫెక్షన్ కారణంగా ఫస్ట్‌నైట్‌కు దూరం..
ఇక మొదటి రాత్రి శ్రావణ్‌కుమార్ ఇన్‌ఫెక్షన్‌కు గురవడంతో శోభనానికి దూరంగా ఉన్నాడు. అతనిలో భార్యపై అనుమానాలు రగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రావణ్‌కుమార్ విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అప్పుడే శ్రావణ్ తన భార్య సెల్‌ఫోన్‌లోని యాప్‌లో నమోదైన ఫోన్‌కాల్స్ విన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. పెళ్లికి ముందు నుంచే రుక్మిణి ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు చేయటంతో ఇరువురి మధ్య వైరం ముదిరింది. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ను అత్తింటివారు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న అల్లుడిని వైద్యులకు చూపించారు. పరీక్షలు చేసిన డాక్టర్లు ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి శ్రావణ్‌కుమార్‌కు సున్తీ చేశారు. అయితే ఈ విషయాన్ని శ్రావణ్‌కుమార్ తల్లిదండ్రులకు చెప్పలేదు.
సామర్థ్యం తగ్గించేందుకే అలా చేశారని..
ఆలస్యంగా ఈ విషయం తెలిసిన వరప్రసాద్ తన కుమారుడికి లైంగిక సామర్థ్యం తగ్గించేందుకు సున్తీ చేయించారని అపోహ పడ్డాడు. తమ పరువు పోతుందని కోపంతో రగిలిపోయాడు. తన కుమారుడితో ఈవిషయంపై చర్చించాడు. భార్య, అత్తమామ మోసం చేశారని నమ్మేలా తన అపోహనే నిజమని శ్రావణ్‌కుమార్ భావించేలా చేశాడు. అదే నిజమనుకున్న కొడుకు కూడా తండ్రి చెప్పినదానికి తలూపాడు. దీంతో వరప్రసాద్ అందరినీ చంపేయాలని పథక రచన చేశాడు.

మొదటి ప్రయత్నం విఫలం..
మొదట మార్చి 10నే చంపాలని నిర్ణయించగా కుదరలేదు. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్ వనపర్తి వెళ్లి భార్య, అత్తామామను తీసుకొచ్చాడు. అప్పటికే వరప్రసాద్ కాలనీ సమీపంలోని ఓ దుకాణంలో రెండు కత్తులు కొనుగోలు చేసి ఇంట్లో సిద్ధంగా ఉంచాడు. రుక్మిణిని ఇంట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులను మొదటి అంతస్తులోకి పంపించాడు. తన భార్య కృష్ణవేణిని ఇంట బయట కాపలాగా ఉంచారు. తర్వాత వరప్రసాద్, శ్రావణ్ మొదట రుక్మిణి నోరు మూసి కత్తులతో పొడిచి చంపారు. వెనువెంటనే వరప్రసాద్ మొదటి అంతస్తుకు చేరుకుని రమాదేవిని విచక్షణరహితంగా పొడిచారు. అడ్డుకునేయత్నం చేసిన వెంకటేశ్‌ను పలుమార్లు పొడవగా తీవ్ర గాయాలతో ఇంట్లో నుంచి బయటపడి తప్పించుకున్నాడు. రమాదేవి పారిపోలేక ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు రావడంతో వెంకటేశ్ 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు.
నిందితుల అరెస్ట్..
కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులైన.. కర్నూలు చింతలమునినగర్‌కు చెందిన నారపురం శ్రావణ్‌కుమార్, అతని తండ్రి నారపురం వరప్రసాద్, తల్లి కృష్ణవేణిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వరప్రసాద్, తన కుమారుడు శ్రావణ్‌తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టగా కృష్ణవేణి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.