Rayalaseema Migration: సీమ వలసెల్లిపోతోంది. అప్పుల భారం నెత్తిన పెట్టుకుని వలసెల్లిపోతోంది. వాన రాక.. వానొచ్చినా పంట రాక సొంతూరిని, కన్నవారిని వదిలిపోతోంది. పిల్లా, పెద్ద, ఆడ, మగ అందరూ తరలిపోతున్నారు. ఉన్న ఊరులో ఉండలేక.. బతకలేక పొట్ట చేతపట్టుకుని అలుపెరుగని బాటసారిలా సాగిపోతున్నారు. రాయలసీమలో వలస బాధితుల విషాధ గాథలెన్నో. ఒక్కో ఇంటిది ఒక్కో గాథ. వింటే గంటలు సరిపోవు. కళ్లెంబడి నీళ్లు నిలిచిపోవు. వలస ప్రాంతంలోనే ఆగిన గుండెలెన్నో. అనాధలైన బతుకులెన్నో. సీమలోని వలస బాధితుల విషాధ చిత్రం అంతులేనిది.

సీమలో వలసలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్నేళ్లు అనావృష్టి ఊరి నుంచి తరిమితే. ఈసారి అతివృష్టి ఊరి నుంచి వెళ్లగొడుతోంది. కుంటలు, చెరువులు నిండేలా.. పొంగిపొర్లేలా వర్షం వచ్చింది. కానీ పంట పెట్టడం తలకు మించిన భారమైంది. కరోన తర్వాత ఫర్టిలైజర్లు, ఫెస్టిసైడ్స్ రేట్లు విపరీతంగా పెరిగాయి. మందులు లేకుండా పంట పెట్టడం గగనమైంది. పంట పెట్టినా గిట్టక అప్పుల పాలైతే.. కొందరు పెట్టలేక వలసబాట పట్టారు. భూమిలోనోళ్ల పరిస్థితి చెప్పనలవి కానిది. రైతు పంట పండిస్తేనే ఉపాధి దొరకుతుంది. కానీ రైతు అరకొర సాగు చేస్తున్నారు. పెట్టుబడుల భారం రైతుల్ని పంట పెట్టనీయడం లేదు. దీంతో భూమిలేనోళ్లు ఉపాధి లేక వలసబాట పడుతున్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వలసలు అధికంగా కనిపిస్తున్నాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వలసపోతున్నారు. సిటీల్లో వివిధ పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. స్థానికంగా వ్యవసాయం తప్ప మరో ఉపాధి లేదు. గతంలో ఉపాధి హామీ పథకం వలసల్ని ఆపింది. పెద్ద ఎత్తున జనం ఊళ్లకు వచ్చి ఉపాధి హామీ పనులు చేసుకునేవారు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ నిధుల్ని సరిగా విడుదల చేయడంలేదు. ఒకవేళ విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇంకో అవసరానికి వినియోగిస్తోంది. ఫలితంగా ఉపాధి హామీ పథకం నీరు గారిపోయింది. పల్లెల్లో ఉపాధి లేకుండా పోయింది. దీంతో జనం వలస బాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది.

వలస ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది అక్కడే మృత్యువు ఒడిలోకి జారుకుంటున్నారు. వలసెళ్లిన వారు తిరిగొచ్చే వరకు ఇంట్లో వారికి అనుమానమే. ఎంతో మంది తల్లిదండ్రులు లేక అనాథలైన పరిస్థితి పల్లె సీమల్లో ఉంది. అనాథ పిల్లల బాధలు వర్ణణాతీతం. వారు మళ్లీ పనుల కోసం వలసెల్లాల్సిందే. తమ పరిస్థితి మరొకరికి రాకూడదంటూ వలస బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
వలసల్ని ఆపడం ప్రభుత్వ బాధ్యత. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మహానగరాలకు దగ్గరగా ఉన్న సీమలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడి ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉపాధి కల్పించవచ్చు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా స్థానికంగా ఉపాధి చూపించగలిగితే వలసలు ఆగుతాయి. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేసింది తక్కువే అని చెప్పుకోవాలి. ఎంత సేపు రాజకీయం తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవు. పాలకుల విధానాలే దశాబ్ధాలుగా సీమకు శాపంగా మారాయని చెప్పవచ్చు.