Director Sujeeth- Pawan Kalyan: ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా సుజీత్ కెరీర్ స్టార్ట్ చేశాడు. పరిశ్రమలోకి వెళ్ళాలి, సీనియర్ డైరెక్టర్ దగ్గర ఐదారేళ్ళ పని చేయాలనే మూసధోరణి ఫాలో కాలేదు. మనలో టాలెంట్ ఉందని నిరూపించుకుంటే అవకాశాలు అవే వస్తాయని నమ్మాడు. హీరో శర్వానంద్ సుజీత్ కి పిలిచి ఆఫర్ ఇచ్చాడు. ఇచ్చిన సదావకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రన్ రాజా రన్ సూపర్ హిట్. ఒక రొమాంటిక్ స్టోరీలో రివేంజ్ యాంగిల్ మిక్స్ చేసి కొత్తగా తీశాడు సుజీత్. శర్వానంద్ కెరీర్లో ఫస్ట్ సోలో అండ్ కమర్షియల్ హిట్ అంటే రన్ రాజా రన్.

శర్వాకు ఒక లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది కూడా ఆ సినిమాతోనే. రన్ రాజా రన్ నిర్మించిన యూవీ క్రియేషన్స్ కి సుజీత్ టాలెంట్ ఏమిటో తెలుసు. అందుకే ప్రభాస్ లాంటి హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తా అంటే ఓకే అన్నారు. రెండో సినిమాతోనే సుజీత్ పేరు ఇండియా వైడ్ వినిపించింది. ఈ మధ్య కాలంలో సాహో చిత్రానికి వచ్చినంత క్రేజ్ మరో చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ గురించి కూడా అంత చర్చ నడవలేదు.
ప్రభాస్ ఇమేజ్, సాహో ప్రోమోలు అంచనాలు ఆకాశానికి చేర్చాయి. అవే సాహో ఫలితాన్ని దెబ్బతీశాయి. హీరోయిజం, యాక్షన్, ఎలివేషన్స్, ట్విస్ట్స్… ఎక్కడా సినిమా తగ్గదు. స్క్రీన్ ప్లే సైతం పరిగెడుతుంది. అసలు ప్రభాస్ ఎవరని అరుణ్ విజయ్ ఒక్కొక్క ముడి విప్పుతుంటే ఒక నిర్జన ప్రదేశంలో వందల మందితో ప్రభాస్ పోరాడుతూ ఉంటాడు. ఆ రేంజ్ క్లైమాక్స్ కంటే ఇంకేం కావాలి. కానీ సినిమా ఫలితం వేరుగా వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాలో సాహో ప్లాప్ అంటూ ఫస్ట్ షో నుండే ప్రచారం మొదలైంది. ప్రతి ఒక్కడు సుజీత్ ని తిట్టేవాడే. ఒక కుర్రాడిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశారు. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. సాహో ఫెయిల్ కావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ప్రభాస్ లుక్, బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి అర్థం కానీ స్క్రీన్ ప్లే, సాంగ్స్. కానీ మూవీలో విషయం ఉంది. అందుకే బాలీవుడ్ లో ఆడింది. రూ. 150 కోట్లు వసూలు చేసింది. నాలుగేళ్లుగా అవమాన భారం మోస్తున్న సుజీత్ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. చేస్తే మళ్ళీ స్టార్ తోనే చేస్తా అని భీష్మించుకుని కూర్చున్నాడు. బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా వదులుకున్నాడు. ఏకంగా పవర్ స్టార్ పవన్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పవన్ ఫ్యాన్ అంటే ఇలా ఉంటాడని నిరూపించాడు.