Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: సక్సెస్ సీక్రెట్ పై పవన్ కళ్యాణ్ కసరత్తు.. అది జరిగితే విజయమే..

Pawan Kalyan: సక్సెస్ సీక్రెట్ పై పవన్ కళ్యాణ్ కసరత్తు.. అది జరిగితే విజయమే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్… ఓ వైబ్రేషన్. ఈ మాట వింటేనే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఏ స్టార్ కి లేనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కు ఉంది. ఆయన పర్యటనకు ప్రజలు, అభిమానులు క్యూకడతారు. చూసేందుకు ఎగబడతారు. కానీ వారు అభిమానులుగా మాత్రమే ఉండిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లుగా మారడం లేదు.మరొకరితో ఓటు వేసేందుకు ప్రయత్నించడం లేదు. జనసేనకు ఇదే మైనస్ గా ఉందని అప్పటికీ.. ఇప్పటికీ విశ్లేషకులు సైతం వ్యక్తం చేసే అభిప్రాయమే ఇది. రాజకీయ ప్రత్యర్థులకు ఇదే ధీమా కూడా. పవన్ కళ్యాణ్ ను సైతం పలుచన చేసే అంశం కూడా ఇదే. ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే మాత్రం జనసేన పొలిటికల్ శక్తిగా మారడం తథ్యం. ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించడం ఖాయం.

Pawan Kalyan
Pawan Kalyan

ఇటీవల పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఆయన ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా జనాలు క్యూకడుతున్నారు. అలాగని అది బలవంతపు జన సమీకరణ కాదు. స్వచ్ఛందంగా, అభిమానంతో తరలివస్తున్న వారు. కానీ ఇలా వస్తున్న అభిమానులంతా కార్యకర్తలుగా ఎప్పుడు మారుతారన్నదే ప్రశ్న. ఈ విషయంలో పవన్ కు కూడా ఒక క్లారిటీ ఉంది. గత ఎన్నికల్లో జన ప్రవాహం చూసి మురిసిపోయానని.. ఎన్నికల ఫలితాల తరువాతే వారంతా కేవలం అభిమానులేనని.. కార్యకర్తలు కాలేకపోయారని గుర్తించానని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇది రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఒక ప్రచారాస్త్రంగా మారిపోయింది. సినిమా నటుడుగానే పవన్ ను అభిమానులు చూస్తున్నారని.. నాయకుడిగా మాత్రం చూడడం లేదని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి అభిమానులే బాధ్యులు. తమ అభిమానాన్ని ఓట్లుగా మలిస్తేనే వారి ఫేవర్ కు నిజమైన అర్ధం, పరమార్థం చేకూరినట్టవుతుంది.

ఏ పార్టీకైనా గ్రౌండ్ లెవల్ బేస్ ముఖ్యం. జనసేనకు ఇదే ప్లస్.. అదే మైనస్. పవన్ అంటే అభిమానం.. జనసేన భావజాలంపై నమ్మకమున్నా ఓట్లుగా ఎందుకు మారడం లేదన్న ఆందోళన జనసేన నాయకుల్లో ఎప్పటి నుంచో ఉంది. అభిమానులను కార్యకర్తలుగా మార్చుకోవడానికి గట్టి ప్రయత్నాలేవీ జరగకపోవడం కూడా జనసేనకు ఒక మైనస్ పాయింట్ గా మారిందని విశ్లేషకుల అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరముంది. పార్టీకి క్షేత్రస్థాయిలో బలమున్నా సమన్వయం చేసే కార్యకర్తలు, నేతలు చాలా కీలకం. పోల్ మేనేజ్ మెంట్ లో బూత్ లెవల్ కమిటీలు క్రియాశీలకం. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బూత్ లెవల్ కమిటీలు, పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తే మాత్రం మంచి ఫలితాలు వచ్చే చాన్స్ ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అందుకే కాబోలు పవన్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు. బూత్ లెవల్ కమిటీల ఏర్పాటుచేసే పనిలో పడ్డారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకునే వారందర్నీ కార్యకర్తలుగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Pawan Kalyan
Pawan Kalyan

పవన్ ప్రతీవారం ప్రజా సమస్యలే అజెండాగా జనాలు ముందుకొస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ ఆయన రాజకీయంగా పావులు కదుపుతారు. కానీ అంతకంటే ముందు పవన్ ను అభిమానించే వారంతా కార్యకర్తలుగా మారితే మాత్రం పవన్ శక్తివంతమైన నేతగా మారే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ లా అభిమానించే జన సైనికులు ఏ పార్టీకి లేరు. తండ్రి మరణంతో సానుభూతి సంపాదించుకున్న కోణంలో జగన్ ను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పులను సైతం ఒప్పుగా చూపించే అభిమానులు ఉన్నారు. అటు చంద్రబాబుది అదే పరిస్థితి. ఆయన రాజకీయంగా వైఫల్యం చెందినా ఆయన్ను అభిమానించే వారూ ఉన్నారు. అందుకే వారు నాయకులుగా నిలబడగలిగారు. ఇప్పుడు పవన్ నాయకుడిగా నిలబడినా శక్తివంతమైన నేతగా చూడాలంటే అభిమానులే మారాలి. కార్యకర్తలుగా మారి పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులుగా చేయాలి. కేవలం అభిమానానికే పరిమితమైతే మాత్రం గత ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం ఉంది. అటు పవన్ కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి అభిమానులను కార్యకర్తలుగా మార్చే ప్రక్రియను మరింత క్రియాశీలకం చేయాలి. అప్పుడే జనసేన అనేది ఒక నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశముంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version