Pawan Kalyan- Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్థానం డిస్ట్రిబ్యూటర్ గా మొదలైంది. మొదట్లో ఆయన ఆటోమొబైల్ బిజినెస్ చేసేవారట. ఆ రంగంలో ఆయన మంచి లాభాలు చూశారు. తర్వాత ఆయన సినిమా డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెట్టారు. మొదట్లో కలిసి రాలేదు. ఆ కారణంగా కొంత డబ్బు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో దిల్ రాజుకు తొలిప్రేమ కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. 1998లో విడుదలైన తొలిప్రేమ చిత్ర నైజాం హక్కులు దిల్ రాజు రూ. 72 లక్షలకు దక్కించుకున్నారట. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఆ మూవీ నైజాంలో ఏకంగా రూ. 2.80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది.

మరో విశేషం ఏమిటంటే పెట్టుబడి మొత్తం కేవలం ఒక థియేటర్ నుండే రావడం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో తొలిప్రేమ రెండు వందల రోజులు ఆడింది. ఆ ఒక్క థియేటర్ కలెక్షన్స్ రూ. 72 లక్షల పైన ఉంటాయని దిల్ రాజు వెల్లడించారు. అంటే కేవలం రూ. 72 లక్షలు పెట్టుబడి పెట్టి దానికి నాలుగింతల వసూళ్లు రాబట్టారు. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు పరిశ్రమలో కొనసాగేందుకు, నిర్మాత అయ్యేందుకు తొలిప్రేమ కారణమైందని దిల్ రాజు చెప్పకనే చెప్పారు.
తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఈ విశేష సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక తొలిప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. దర్శకుడు కరుణాకరన్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ నాలుగో చిత్రంగా తొలిప్రేమ విడుదలైంది. తొలిప్రేమ పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫేమ్ తెచ్చిపెట్టింది. కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించారు.

దర్శకుడు కరుణాకరన్ నుండి ఈ స్థాయి చిత్రం మరలా రాలేదు. కరుణాకరన్ కి ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం. దిల్ రాజు ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం ఆయన చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్సెస్ దిల్ రాజుగా మారింది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని దిల్ రాజు పరిశ్రమపై ఆధిపత్యం చలాయిస్తున్నాడనే వాదన వినిపిస్తోంది. ఆయన నిర్మాతగా తెరకెక్కిన వారసుడు చిత్ర విడుదలపై వివాదం నడుస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న నేపథ్యంలో తమిళ చిత్రంగా పరిగణించి, సంక్రాంతికి విడుదల చేయడానికి వీలు లేదు అంటున్నారు.