Pawan Kalyan- Balakrishna: ఏపీలో అధికార వైసీపీకి ప్రత్యర్థుల చర్యలు ఏమాత్రం మింగుడుపడడం లేదు. అది ఏ రంగమైనా తమ కనుసన్నల్లో నడవాలని తెగ ఆరాటపడుతుంటారు. ఇప్పటికే సినిమారంగం జోలికి వెళ్లి చేతులు కాల్చుకున్నారు. ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేస్తూ చేసిన యాగి నవ్వులపాలైంది. దాదాపు సినిమారంగం వైసీపీకి దూరమైంది. అలీ, పోసాని కృష్ణమురళి వంటి ఒకరిద్దరు తప్ప అంతా దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి అధికార పార్టీ నేతలు బుల్లితెరపై పడ్డారు. దీనికి కారణం లేకపోలేదు. బాలక్రిష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ విచ్చేస్తుండడమే అందుకు కారణం. పవన్ పై షూటింగ్ మొదలు పెట్టారో లేదో మాజీ మంత్రి, జగన్ కుటుంబానికి పెద్ద పాలేరుగా చెప్పుకునే పేర్ని నాని మీడియా ముందుకొచ్చారు. పవన్ కు శాపనార్థాలు పెట్టారు. కులాలు, మతాలు అంటూ అర్థం పర్థంలేని ఆరోపణలు, విమర్శలు చేశారు. వ్యక్తిగత కామెంట్స్ చేశారు. తెలుగునాట ఎన్నో టాక్ షోలు వచ్చాయి. తమ పార్టీ నేతలుగా ఉన్న రోజా, అలీ, పోసాని లాంటి వారు కూడా షోలు చేశారు. కానీ బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ పై వైసీపీ నేతల కడుపు మంట స్పష్టంగా కనిపిస్తోంది.

ఏ రంగమైనా లాభపేక్ష లేనిదే విలువైన సమయాన్ని ఎవరూ వదులుకోరు. అందునా సినిమా రంగం వారు అస్సలు ఇష్టపడరు. ఇది అందరికీ తెలిసిన విషమమే అయినా.. తనకు తాను మేధావిగా విశ్లేషణలు చేసే పేర్ని నాని మాత్రం అన్ స్టాపబుల్ ఒక ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమంగా చెప్పుకొచ్చారు. అక్కడ అందరికీ పేమెంట్లు ఉంటాయన్నారు. అక్కడకు వచ్చేవారు ఏం మాట్లాడాలో ముందే రాసిస్తారని చెప్పారు. అయితే ఏ టాక్ షో అయినా అలానే ఉంటుందని.. దానికి కొత్తగా పేర్ని నాని చెప్పడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్నాళ్లూ లేనిది ..ఎంతోమంది ప్రముఖుల ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తరువాత పేర్ని నాని మాట్లాడడమేమిటన్న చర్చ ప్రారంభమైంది. కేవలం పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలుపెట్టారో లేదో మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. పవన్ ఎపిసోడ్ లో ఎటువంటి ఝలక్ లు తగలబోతున్నాయో ముందే ఊహించినట్టుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేర్ని నాని అటు అన్ స్టాపబుల్ తో పాటు ఇటు పవన్ పై అక్కసు వెళ్లగక్కడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ప్రధానంగా పవన్ నే పేర్నినాని టార్గెట్ చేసుకున్నారు. జగన్ ను తిట్టడానికి వారం వారం ఒక అడ్డ గాడిద వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. కేవలం జగన్ ను తిట్టినంత మాత్రాన సీఎం అయిపోతారా? అని ప్రశ్నించారు. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి సీఎం అయితే సంతోషపడతామని…. అయినా ఆ స్థాయి వ్యక్తి ఎవరున్నారని కూడా వ్యాఖ్యానించారు. పవన్, చంద్రబాబు ఒకటేనన్నారు. చాలా విషయాల్లో ఇది తెలిసిందన్నారు. చంద్రబాబునాయుడు పేరులో నాయుడు ఉన్నందున ఆయన కాపులుగా చాలామంది అనుకుంటున్నారని.. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అని వ్యంగ్యంగా మాట్లాడారు. సమాజాన్ని ప్రేరేపితం చేసే వ్యక్తి వస్తే ఓకే కానీ.. అలా వచ్చిన వాడే జగన్ అని తన అభిమాన భాషలో చెప్పుకొచ్చారు.

వైసీపీ నేతలు రానురాను మరింత దిగజారిపోతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నామని కూడా మరిచిపోతున్నారు. పేర్ని నాని వ్యాఖ్యలు వింటే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. నేరుగా కులం పేరు పెట్టి మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాపు వారు,కమ్మవారు అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం, జగన్ కంటే గొప్ప నాయకుడు ఎవరూ లేరని మాట్లాడే క్రమంలో తన స్థాయిని దిగజారి మాట్లాడారు. అయితే ఒక మాట చెప్పగలం. బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో పవన్ బలమైన వ్యాఖ్యలు చేస్తారని.. అవి ప్రభుత్వం, ప్రజలపై ప్రభావం చూపే అవకాశముందని తెలిసే పేర్ని నానితో ముందస్తుగా మాట్లాడించారన్న టాక్ నడుస్తోంది. మాట్లాడించే వాడికి బుద్ధి లేకున్నా.. మాట్లాడిన వ్యక్తి బుద్ధి ఎటు పోయిందన్న కామెంట్స్ అయితే మాత్రం వినిపిస్తున్నాయి.,