Parvatipuram: ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్ళు కట్టు బానిస అయ్యాడు. శ్రమ దోపిడీకి గురయ్యాడు. చివరకు అధికారులు స్పందించడంతో వెట్టి చాకిరి నుంచి ఆ వ్యక్తికి విముక్తి కలిగింది. ఇటీవల తమిళనాడులోని( Tamila Nadu) శివగంగై జిల్లాలో కార్మిక శాఖ ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో కడంబన్ కులం గ్రామంలో ఓ తోటలో అప్పారావు అనే వృద్ధుడు పనిచేస్తున్నాడు. అధికారులు ఆరా తీస్తే తన పేరు చుక్క అని.. తనది పార్వతిపురం జిల్లా అని చెప్పడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. గత 22 సంవత్సరాలుగా ఆయన వెట్టి చాకిరికి గురయ్యారని తెలుసుకొని విముక్తి కల్పించారు. చుక్కా కథను తెలుసుకొని ఆయనను కుమార్తె వద్దకు పంపించారు.
Also Read: వివేకానంద రెడ్డి వర్ధంతి.. షాక్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు!
* 2003లో రైల్లో వెళ్తుండగా..
పార్వతీపురం మన్యం జిల్లా( parvatipuram manyam district ) కు చెందిన కొండగొర్రి చుక్క 2003లో చెన్నైలో ఉపాధి పనులు చేసుకునేందుకు రైలులో వెళ్ళాడు. తమిళనాడులోని శివగంగై రైల్వే స్టేషన్లో టీ తాగేందుకు ఆగాడు. ఈ క్రమంలో రైలు ముందుకు పోయింది. అందుకోలేక స్టేషన్లో ఉండిపోయాడు. భాష రాకపోవడం, నిరక్షరాస్యుడు కావడంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో స్థానికుడు అన్నాదురై పరిచయం అయ్యాడు. పని ఇప్పిస్తానని నమ్మించి తోటకు తీసుకెళ్లి పనులు చేయించాడు. ఇలా 22 సంవత్సరాల పాటు తోట పనులతో పాటు గొర్రెల మేత చేయించాడు. కనీసం ఇంటికి పంపే ప్రయత్నం చేయలేదు. అటు చుక్కకు సైతం తెలియనివ్వలేదు. పైగా అక్కడి పేరును అప్పారావుగా మార్చేశాడు.
* జిల్లా యంత్రాంగానికి సమాచారం
అయితే కార్మిక శాఖ( Labour Department ) అధికారుల సర్వేలో అతని పేరు అప్పారావు కాదని.. కొండ గొర్రె చుక్క అని తేలిపోయింది. దీంతో అక్కడి కార్మిక శాఖ అధికారులు పార్వతిపురం మన్యం కలెక్టర్ ను సంప్రదించారు. చుక్క చిరునామా గుర్తించే పనిలో పడ్డారు. అయితే చుక్క భార్య ఐదేళ్ల క్రితం చనిపోయినట్లు తేలింది. కుమార్తె సాయమ్మ కుటుంబం పార్వతీపురం మండలం ములక్కాయ వలసలో ఉందని తెలుసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులను శివగంగై తీసుకెళ్లారు. కుమార్తెను చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు చుక్క. శివగంగై కలెక్టర్ చుక్కకు 3 లక్షల రూపాయల నగదు సాయం చేశారు. అన్నా దురై పై కేసు నమోదు చేశారు.
* ఉపాధికి భరోసా
చుక్క కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చింది. కలెక్టర్ శ్యాం కుమార్( collector Shyam Kumar ) చుక్కకు ఒక ఇంటితో పాటు మేకల యూనిట్ను మంజూరు చేశారు. సుమారు 22 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో ఆనందం నెలకొంది. ఇన్ని రోజులు ఆచూకీ లేకపోవడంతో చనిపోయాడని భావించామని.. మళ్లీ పునర్జన్మతో ఇంటికి వచ్చాడని ఆనందిస్తున్నారు కుటుంబ సభ్యులు.
Also Read: కూటమికి ‘రుషికొండ’ అస్త్రం.. చేజేతులా అందించిన జగన్మోహన్ రెడ్డి!