Bus Conductor : వెనుకటికి ఓ సినిమాలో బ్రహ్మానందం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటాడు. అతడి చేతిలో శునకం ఉంటుంది. “నీతో పాటు నువ్వు మోస్తున్న శునకానికి కూడా టికెట్ తీసుకోవాలని” కండక్టర్ బ్రహ్మానందాన్ని అడుగుతాడు. దీనికి బ్రహ్మానందం “శునకాన్ని మోస్తోంది నేను. అలాంటప్పుడు నేను ఎందుకు టికెట్ కొనాలి” అంటాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరికి కండక్టర్ సైలెంట్ అయిపోతాడు. అదంటే సినిమా కాబట్టి.. కాసేపు నవ్వుకుంటాం. కానీ నిజజీవితంలో కండక్టర్లు అలా ఉండరు. పైగా టికెట్ కొడతారు. ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారు. అలాంటి సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు ప్రాంతం నుంచి మైసూర్ కు ఓ మహిళ తన మనవరాలితో కలిసి ప్రయాణించింది. అలా తను ప్రయాణిస్తూ వెంట నాలుగు చిలుకలను తీసుకెళ్లింది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకం కూడా ఉంది. దానికి శక్తి అనే పేరు పెట్టారు. శక్తి అనే పథకంలో భాగంగా ఆ మహిళ, తన మనవరాలు బెంగళూరు నుంచి మైసూరుకు ఉచితంగానే ప్రయాణించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వాళ్లకు ఆర్టీసీ కండక్టర్ ఇచ్చాడు. ఆ మహిళ తన మనవరాలితో కలిసి చిలుకలను తీసుకెళ్తోంది. “శక్తి పథకంలో మీకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. కానీ మీరు తీసుకెళ్తున్న చిలుకలకు కచ్చితంగా టికెట్ తీసుకోవాలని” కండక్టర్ 444 టికెట్ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ షాక్ కు గురైంది.
ఈ దృశ్యాలను ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు తన ఫోన్లో బంధించాడు. వాటిని కాస్తా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది దెబ్బకు ఈ విషయం వైరల్ గా మారింది. “చిలుకలను తీసుకెళ్తున్నారు కాబట్టి 444 తో సరిపెట్టాడు.. అదే కుక్కలను తీసుకెళ్తే 1000 రూపాయలు చెల్లించాలని అడిగేవాడు కాబోలు” అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “శక్తి పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ కండక్టర్లకు మహిళా ప్రయాణికుల మీద ఆగ్రహం పెరిగినట్టుంది. సందు దొరికితే చాలు వారు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారంటూ” ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే చాలామంది నెటిజన్లు ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగ నిరతిని కొనియాడుతున్నారు.