PAN Card: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తప్పించుకోకుండా కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోంది. దీంతో ఇప్పటికే దేశంలో ఆదాయపు పన్ను వసూళ్లు పెరిగాయి. ఈ క్రమంలోనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సూచించింది. అయినా చాలా మంది లింక్ చేయలేదు. దీంతో గడువు మరోసారి పెంచింది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ(Adhar enrollment Id)తో పాన్ కార్డు పొందిన వారు 2025 డిసెంబర్ 31 లోగా తమ ఒరిజినల్ ఆధార్ నంబర్(Original adhar number)తో దాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 3, 2025న విడుదలైంది. 2024 అక్టోబర్ 1 లేదా అంతకు ముందు ఆధార్ దరఖాస్తు ఐడీ ఇచ్చి పాన్ తీసుకున్న వారందరూ ఈ గడువులోగా ఆదాయపు పన్ను శాఖకు తమ ఆధార్ నంబర్ తెలియజేయాలి. అయితే, ఈ ప్రక్రియ ఎలా చేయాలన్న దానిపై స్పష్టమైన సమాచారం ఇంకా రాలేదు.
ట్యాక్స్‌మన్.కామ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా(Naveen Vadhwa)మాట్లాడుతూ, ‘పాన్–ఆధార్ లింకింగ్ పద్ధతినే ఈ నిర్దిష్ట పాన్ హోల్డర్లు ఉపయోగించవచ్చు. ఈ–ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ కేసులో పెనాల్టీ ఉండకపోవచ్చని భావిస్తున్నాం, కానీ ఆదాయపు పన్ను శాఖ నుంచి స్పష్టత వస్తేనే కచ్చితంగా చెప్పగలం‘ అన్నారు. మరోవైపు, ట్యాక్స్ కన్సల్టింగ్ సంస్థ భూటా షా అండ్ కో ఎల్‌ఎల్పీ పార్టనర్ స్నేహ పాధియార్ సూచన ప్రకారం, పాన్ సేవా కేంద్రాలైన ఎన్‌ఎస్‌ఈఎల్ ఈగవ్ లేదా యూటీఐఐటీఎస్‌ఎల్‌ను సందర్శించి, పాన్, ఆధార్ కాపీలతో పాటు నిర్దేశిత ఫారం నింపడం ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. డేటాలో పొంతన లేకపోతే బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి అని ఆమె తెలిపారు.
లింక్ చేయకుంటే పెనాల్టీ..
ప్రస్తుతం సాధారణ పాన్ హోల్డర్లు ఆధార్‌తో లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే వారికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. కానీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ తీసుకున్నవారికి అప్పట్లో ఒరిజినల్ ఆధార్ లేనందున, వారికి పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అంచనా. గడువు తర్వాత ఏం జరుగుతుందన్నది నోటిఫికేషన్‌లో స్పష్టంగా చెప్పలేదు. ఒకవేళ 2025 డిసెంబర్ 31 లోగా ఆధార్ నంబర్ తెలియజేయకపోతే, 2026 జనవరి 1 నుంచి పాన్ పనిచేయకపోవచ్చని వాధ్వా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూడాల్సిందే!