Pakistan Railway: రైల్వే క్రాసింగ్.. అనగానే మనకు టక్కున గేట్ గుర్తొస్తుంది. ఏదైనా మార్గంలో రైల్వే క్రాసింగ్ ఉంటే ముందుగానే భారత రైల్వే శాఖ రోడ్డుకు కిలో మీటర్ దూరం నుంచే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇలా ముందు రైల్వే గేటు ఉందన్న విషయాన్ని వాహనదారులకు తెలియజేస్తుంది. మరోవైపు రైల్వే గేట్‌ల ఆధునికీకరణ కూడా జరిగింది. సాంకేతిక వినియోగంతో ఆటోమేటిక్ లాకింగ్ సిస్టం కూడా వచ్చింది. రైలు వస్తుందని సిగ్నల్ రాగానే గేటు దానికదే మూసుకునేలా చాలాచోట్ల ఏర్పాటు చేశారు. మొదట రైలు వస్తుందంటే మాన్యువల్‌గా గేట్‌మన్ గేటు వేసేవాడు. తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇటీవల ట్రాఫిక్ పెరగడంతో రైల్వే క్రాసింగ్‌లతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే జీరో రైల్వే క్రాసింగ్‌కు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు.. అండర్ పాస్‌లు నిర్మిస్తుంది. దీంతో గంటల తరబడి రైల్వే గేటు వద్ద నిరీక్షించే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రైల్వే ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని పనులు కొనసాగుతున్నాయి.
పాకిస్తాన్‌లో అలా..
ఇండియాలో రైల్వే క్రాసింగ్ గురించి తెలుసుకున్నాం. అయితే మన దాయాది దేశం పాకిస్తాన్‌లో రైల్వే క్రాసింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో ఇప్పటికీ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ లేదు. ఇంకా డీజిల్ ఇంజిన్ రైళ్లే నడుస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే.. గతంలో కొన్ని మార్గల్లో పాకిస్తాన్ ప్రభుత్వం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టిందట. కానీ, అక్కడ కాపర్ దొంగలు తరచూ రైల్వే విద్యుత్ తీగను దొంగిలించేవారట. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియనే నిలిపివేసి డీజిల్ ఇంజిన్లను నడుపుతోంది.
రైల్వే గేట్లు కనిపించవట..
ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో రైల్వే గేట్లు కనిపించవట. అదేంటి అంత సెక్యూరిటీ, సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా అని పొరపడేరు. అదేం కాదు. అక్కడ నడిచేవన్నీ డీజిల్ ఇంజిన్లే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆగుతాయట. రైలుకు అడ్డంగా ఎవరైనా వచ్చినా డ్రైవర్ ట్రైన్ ఆపేస్తాడట. అందుకే ఆ దేశంలో రైల్వే క్రాసింగ్ గేట్లు ఉండవంటున్నారు. రైలు వస్తుందని తెలియగానే రోడ్డు కమ్ రైలు క్రాసింగ్ ఉన్న చోట ఇద్దరు వ్యక్తులు నిలబడతారు. ఒకరు ఎర్రజెండా, మరోకరు ఆకుపచ్చ జెండా పట్టుకుంటారు. ఎర్రజెండాను వాహనదారులకు చూపి.. పచ్చ జెండాతో రైలు వెళ్లడానికి సిగ్నల్ ఇస్తారు. రైలు వెళ్లిపోగానే వాహనదారులకు పచ్చజెండా ఊపి వెళ్లిపోయేలా సిగ్నల్ ఇస్తారు. ఇలా ఇప్పటికీ ఎలాంటి సాంకేతిక అభివృద్ధి లేకుండా సాగుతోంది మన పొరుగు దేశం పాకిస్తాన్ రైల్వే శాఖ.
https://www.youtube.com/watch?v=uMby5EUA0kM