
ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ కరోనా సోకుతుందా…? ఇప్పుడు ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకిందని ప్రకటించారు. బెల్జియం, నెదర్లాండ్స్ లో సైతం ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు స్పెయిన్ నుంచి హాంకాంగ్ కు వచ్చిన ఒక వ్యక్తికి రెండోసారి కరోనా సోకినట్లు గుర్తించారు.
అయితే గతేడాది మార్చిలో సోకిన కరోనా రకం ప్రస్తుతం సోకిన కరోనా రకం వేరువేరు కావడం గమనార్హం. అయితే రెండోసారి కరోనా సోకిన సమయంలో సదరు వ్యక్తిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని సమాచారం. దీంతో ఒకసారి కరోనా బారిన పడిన వాళ్లకు మరోసారి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని తేలుతోంది. అయితే వైరస్ కొత్తగా సోకుతోందా…? లేక శరీరంలో ఉన్న వైరస్ తిరగబెడుతోందా…? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెంది తక్కువ కాలం కావడంతో వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు ఎన్నిరోజులు ఉంటాయనే విషయం తెలియాల్సి ఉంది. శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వైరస్ కు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని… వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు.