Homeట్రెండింగ్ న్యూస్Khammam: ఎద్దు మూత్రం పోస్తే కేసా? జర మారండ్ర బాబూ

Khammam: ఎద్దు మూత్రం పోస్తే కేసా? జర మారండ్ర బాబూ

Khammam: మన పోలీస్ శాఖకు వెనకనుంచి ఏనుగు పోయినా పర్వాలేదు. ముందు నుంచి మాత్రం దోమ పోకూడదు. అదే వాళ్ల తత్వం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తాము ఎల్లవేళలా కృషి చేస్తున్నామని చెప్పుకునే పోలీస్ శాఖ కొన్ని కొన్ని సార్లు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో బియ్యం గింజలు తిన్నదని ఓ కోడి పుంజు పై కేసు పెట్టారు.. ఇది స్థానికంగా నవ్వులు పూయించినా.. ఏ జంతుజాలం కూడా మమ్మల్ని అడ్డుకోవద్దు అనే సంకేతాన్ని అధికార పార్టీ నాయకులు ఇచ్చారు. అంతే కాదు మీకోసమే మేము అనే సంకేతాన్ని పోలీసులు మరింత బలంగా చాటారు. కానీ ఆ కోడిపుంజు పెంచుకుంటున్న వ్యక్తి మాత్రం పోలీసులకు ఎంతో కొంత ఇచ్చుకుని బయటపడ్డాడు. ఇక ఇటువంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జరిగింది. కాకపోతే అక్కడ కోడిపుంజు స్థానంలో ఇక్కడ ఎద్దు ఉంది. అక్కడ అది బియ్యం గింజలు తింటే.. ఇక్కడ ఇది మూత్రం పోసింది.

Khammam
Khammam

ఇంతకీ ఏమైంది అంటే

ఇల్లందు పట్టణం… సింగరేణి గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలోనే మొదటిసారి బొగ్గు కనుగొన్నారని చెబుతారు. పైగా ఇక్కడ మార్వాడి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అలాంటి ఈ ప్రాంతంలో రెండవ బస్తీలో నివసించే సుందర్ లాల్. పేద కుటుంబానికి చెందినవాడు.. తనకున్న ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అ బండి మీద ఇసుక, మట్టి, చిన్నా చితకా సామగ్రి తోలుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడి కుటుంబం సింగరేణి జిఎం కార్యాలయానికి సమీపంలో ఉంటుంది. రోజూ ఇతడి బండి జిఎం కార్యాలయం ముందు నుంచి వెళ్తూ ఉంటుంది.. అయితే ఒక రోజు ఇతడికి ఒక కిరాయి దక్కింది.. అందులో భాగంగా బండి లో మట్టి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో జిఎం కార్యాలయం ముందుకు రాగానే ఎద్దు మూత్రం పోసింది. దీన్ని అలాగే వదిలేస్తే బాగుండేది. కానీ జీఎం కార్యాలయ సిబ్బంది మాత్రం అలా వదిలేయలేదు. మా జిఎం కార్యాలయం ముందే మూత్రం పోస్తుందా అంటూ ఎద్దు పై రంకెలు వేశారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Khammam
Yellandu

పోలీసులు ఏం చేశారంటే

జిఎం కార్యాలయం నుంచి ఫిర్యాదు రావడంతో ఇల్లందు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.. సదరు ఎద్దుల బండి ఓనర్ సుందర్ లాల్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అసలు ఎన్నడు కూడా పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్.. ఆకస్మాత్తుగా పోలీసులు పిలిచేసరికి కంగారు పడ్డాడు. భయం భయంగానే పోలీసు స్టేషన్ కి వెళ్ళాడు. జరిగిన విషయం ఏంటి అని ఆరా తీస్తే… “నీ ఎద్దు జీఎం కార్యాలయం ఎదుట మూత్రం పోసింది. దానికి వారు నొచ్చుకున్నారు. గతంలో కూడా నీ ఎద్దు పలుమార్లు ఇలానే చేసిందట.” అని పోలీసులు సుందర్ లాల్ కు వివరించారు.. దీంతో ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్ అని ఆశ్చర్య పోవడం సుందర్ లాల్ వంతయింది. కేసు నమోదు అయింది. కోర్టుకు వెళ్లి అపరాధ రుసుం చెల్లించాలని పోలీసులు ఆదేశించారు. ఒకవేళ ఫైన్ చెల్లించని పక్షంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.. దీంతో సుందర్ లాల్ ఫైన్ చెల్లించేందుకే మొగ్గు చూపాడు.. కానీ దీనిపై వివరాలు తెలుసుకునేందుకు జీఎం కార్యాలయానికి వెళ్ళగా… అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.. పైగా కార్యాలయం ముందు నుంచి ఎద్దుల బండి వెళితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో తన ఎద్దుల బండి ఎటు నుంచి నడిపించాలో తెలియక సుందర్ లాల్ ఇప్పుడు తల పట్టుకున్నాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version