Jabardasth Rowdy Rohini : జబర్దస్త్ కమెడియన్ రోహిణికి మరో సర్జరీ జరిగింది. ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేరింది. కాలు నుండి ఐరన్ రాడ్ వైద్యులు తొలగించారు. ఈ విషయాన్ని రోహిణి స్వయంగా తెలియజేశారు. రోహిణి 2016లో ప్రమాదానికి గురయ్యారు. ఆమె కాలి ఎముక విరిగింది. దాంతో వైద్యులు ఎముకకు సపోర్ట్ గా ఐరన్ రాడ్ అమర్చారు. గాయం మానినప్పటికీ కాలిలో ఉన్న రాడ్ ఇబ్బంది పెడుతుందట. డాన్స్ చేసేటప్పుడు, వేగంగా నడిచేటప్పుడు, దూకినప్పుడు నొప్పిగా అనిపిస్తుందట. తన కాలిలో అమర్చిన రాడ్ తీసేయాలని రోహిణి వైద్యులను కోరారు.
పరీక్షల అనంతరం రోహిణి కాలిలో ఉన్న రాడ్ తొలగించడం కుదరదని వైద్యులు చెప్పారు. ఎముకలోకి రాడ్ చొచ్చుకుపోయింది. బలవంతంగా బయటకు తీస్తే డామేజ్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎలాగైనా రాడ్ తీసేయాలని డిసైడ్ అయిన రోహిణి విజయవాడ వచ్చారు. ఆమెకు రాడ్ అమర్చిన ఆసుపత్రిలోనే మారలా సర్జరీ చేయించుకున్నారు. ఈసారి సక్సెస్ ఫుల్ గా వైద్యులు రాడ్ తొలగించారు. తన కాలి నుండి తీసిన రాడ్ ని రోహిణి వీడియోలో చూపించారట.
గంటల తరబడి శ్రమిస్తే కానీ రాడ్ బయటకు రాలేదట. ఎముకలో ఉన్న రాడ్ ని బలవంతంగా పైకి కొట్టారని పక్కనే ఉన్న రోహిణి తల్లిగారు చెప్పారు. కొన్ని వారాలు రోహిణి నడవడానికి లేదు. ఆమె వీల్ చైర్ కే పరిమితం కావాల్సి ఉంది. తనకు విజయవాడలో సర్జరీ జరిగిన విషయాలను రోహిణి షూట్ చేశారు. తన యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియో అప్లోడ్ చేశారు. అసలు రాడ్ వస్తుందా రాదా? ఎముకకు ఏమైనా డామేజ్ జరుగుతుందా అని చాలా టెన్షన్ పడ్డట్లు రోహిణి చెప్పుకొచ్చారు. రాడ్ తొలగించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
రోహిణి సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టింది. జబర్దస్త్ కి వచ్చాక ఆమెకు బాగా ఫేమ్ వచ్చింది. లేడీ కమెడియన్ గా ఆమె రాణిస్తున్నారు. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. సెన్సేషనల్ మూవీ బలగంలో వేణు భార్య రోల్ చేసింది. శవం వద్ద ఏడ్చే సన్నివేశంలో రోహిణి నవ్వులు పూయించింది. హాట్ స్టార్ లో ఆదరణ దక్కించుకుంటున్న సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లో కూడా రోహిణికి మంచి పాత్ర దక్కింది.