
Samantha Shakuntalam: సెంటిమెంటో, ఆ సబ్జెక్ట్ జనాలకు నచ్చదో తెలియదు కానీ… శకుంతల జీవిత గాధ వెండితెర మీద సక్సెస్ కాలేదు. నందమూరి తారక రామారావు రెండు సార్లు ప్రయత్నం చేసిన భంగపాటుకు గురయ్యారు. ఆయన నటించిన శకుంతల, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. 1966లో ఎన్టీఆర్-బి.సరోజా జంటగా శకుంతల టైటిల్ తో కమలాకర కామేశ్వరరావు ఓ మూవీ తెరకెక్కించారు. టాప్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కిన శాకుంతలం చిత్రం మీద హైప్ ఏర్పడింది. ఫలితం మాత్రం నిరాశపరిచింది. ప్రేక్షకులు శకుంతల చిత్రాన్ని ఆదరించలేదు.

శకుంతల మూవీలో సీనియర్ ఎన్టీఆర్ దుష్యంతుడిగా, సరోజ శకుంతలగా నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్ ఈ సబ్జెక్టు మీద మరో ప్రయత్నం చేశాడు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర టైటిల్ తో శకుంతల కథను తెరకెక్కించారు. ఈ మూవీలో మూడు తరాల నందమూరి హీరోలు నటించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ విశ్వామిత్రుడు పాత్ర చేయగా… బాలయ్య దుష్యంతుడు, జూనియర్ ఎన్టీఆర్ భరతుడు పాత్ర చేశారు.
దీంతో హైప్ మధ్య విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సైతం నిరాశపరిచింది. ఈ చిత్రంలో మధుమిత శకుంతల పాత్ర చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ హిందీ వర్షన్ లో మాత్రమే నటించినట్లు సమాచారం. శకుంతల ఇతివృత్తంతో సక్సెస్ కొట్టాలన్న ఎన్టీఆర్, బాలయ్యల ప్రయత్నం ఫలించలేదు.

మరో ముప్పై ఏళ్లకు దర్శకుడు గుణశేఖర్ ఈ సాహసం చేస్తున్నారు. స్టార్ లేడీ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం టైటిల్ తో మూవీ తెరకెక్కించారు. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, బాలయ్య హిట్ కొట్టలేకపోయిన సబ్జెక్టు తో సమంత సక్సెస్ అందుకుంటుందా అనే చర్చ నడుస్తుంది. ఒకవేళ శాకుంతలం హిట్ కొడితే… ఎన్టీఆర్, బాలయ్య చేయలేని పని చేసినట్లు అవుతుంది. మరి చూడాలి సమంత ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని ఎలా అధిగమిస్తుందో. దిల్ రాజు నిర్మించిన శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.