
NTR-Lokesh: వారిద్దరూ ఒకే వేదిక పై కనిపించాలి. వారిద్దరూ ఒకే తెర పై నటించాలి. అది కళ్లారా చూడాలి. ఇది వారిద్దరి అభిమానుల ఎన్నో ఏళ్ల తీరని కోరిక. అభిమానుల కోరిక తీరుతుందో.. లేదో. కానీ వారి వారసులు మాత్రం ఆ కోరికను తీర్చేశారు. తొలిసారిగా ఒకే వేదిక పై కనువిందు చేశారు. హైదరాబాద్ లో సందడి చేశారు. ఇంతకీ వారెవరు ? వారి కథేంటో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ సాధారణ విషయం కాదు. సీనియర్ ఎన్టీర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అభిమానులు ఆరాధ్య ధైవంలా వారిని అభిమానిస్తారు. వారి సినిమాలంటే ఎగబడి చూస్తారు. అయితే అందమైన చంద్రుడి పై చిన్న నల్లటి మచ్చ ఉన్నట్టు.. నందమూరి కుటుంబం పై కూడా పుకార్లు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాలకు సఖ్యత లేదని బయట ప్రచారం ఉంది. వారిద్దరూ ఒకే వేదిక పై కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎన్టీఆర్, బాలయ్య మధ్య పూడ్చలేని అగాధం ఉందని ఒక ప్రచారం నడుస్తోంది. మీడియాలో కూడా ఇలాంటి వార్తలు గతంలో చాలాసార్లు వచ్చాయి. వీటిని నందమూరి కుటుంబ సభ్యులు ఖండించనూ లేదు. అలాగని సమర్థించనూ లేదు. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత అని ఎవరి మానాన వారిని వదిలేశారని చెప్పవచ్చు.
బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబాలకు గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో .. ఒక కొత్త సంఘటన తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి ఒకే చోట దర్శనమిచ్చారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈవెంట్ లో కలిసి కనిపించారు. ఒకే చోట కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నారు. లక్ష్మీప్రణతి, బ్రాహ్మణితో పాటు వారి పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లు వీరి కుటుంబాల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి ఒకేచోట కనిపించడంతో ఆ ప్రచారానికి కొంత మేర తెరపడిందని చెప్పవచ్చు.
ఫార్మాలా ఈవెంట్లో లక్ష్మీ ప్రణతి, బ్రాహ్మణి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరిద్దరి కలయిక అభిమానుల్లో ఆనందోత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. ఇటీవల తారకరత్న గుండెపోటుతో చికిత్స పొందుతున్న సమయంలో కూడా లక్ష్మీ ప్రణతి, నారాబ్రహ్మణి ఆస్పత్రిలో ఒకే చోట కనిపించారు. ఇప్పుడు ఫార్మాలా ఈవెంట్లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పవచ్చు. నారా లోకేష్ ఓ వైపు పాదయాత్ర చేస్తున్నారు. టీడీపీకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ భార్య, లోకేష్ భార్య ఒకే చోట కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇదొక కొత్త చర్చకు కూడా దారితీసిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. నందమూరి కుటుంబంలో గ్యాప్ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఈ కలయికలు జరుగుతున్నాయా అన్న అనుమానమూ లేకపోలేదు. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో ఇది చంద్రబాబు వేసిన స్కెచ్చా అన్న ప్రశ్నలు పురుడు పోసుకుంటున్నాయి. ఏది ఏమైనా నందమూరి కుటుంబంలో గ్యాప్ తగ్గాలనుకుంటున్న అభిమానులకు ఇది ఒక శుభవార్తే అవుతుంది.