
మీలో ఎవరైనా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా…? అయితే మీకో శుభవార్త. కేంద్రం త్వరలోనే బైక్, స్కూటర్ ల ధరలను భారీగా తగ్గించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు భారీగా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం కేంద్రం 28 శాతం జీఎస్టీ విధిస్తూ ఉండటం వల్ల టూ వీలర్లను కొనుగోలు చేసే వారిపై అధిక భారం పడుతోంది. అయితే వచ్చే నెల మూడో వారం జరగబోయే సమావేశం కంటే ముందే కేంద్రం జీఎస్టీ తగ్గించనుందని తెలుస్తోంది.
ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం జీఎస్టీ రేటును ఎంత తగ్గిస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా టూవీలర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల వాహన డీలర్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. వాహన కంపెనీలకు కూడా నష్టాలు వాటిల్లుతున్నాయి.
ఇలాంటి సమయంలో జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్రం మరికొన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేయనుందని తెలుస్తోంది. కన్‌స్ట్రక్షన్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, హోటల్స్, టూరిజం రంగాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం ముందడుగులు వేయనుంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అమలు చేస్తున్న ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ పథకంలో కూడా పలు మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం.