https://oktelugu.com/

Review on RRR Movie :”మూడార్లు” నాలుగు కాలాలు నిలిచే సినిమానా ?

“మూడార్లు” నాలుగు కాలాలు నిలిచే సినిమానా ? మూడు గంటల్లో ముగిసే సినిమానా? బాహుబలికి మించిన సినిమానా? ఏడు బలమైన సీన్లు అంతకు మించిన ఎలివేషన్ సీన్లు సరిపోతాయా? “అవతార్ ” కు మించి సీన్లు ఉంటే చాలా కదిలించగల కథ ఉండవద్దా? ఇండియా లో ఏ సినిమా కు చేయని ప్రమోషన్ చేయడం వల్ల ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్. కానీ… పేరుకి భారీ వంట. దినుసులు బాగానే వేసినా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2022 12:35 pm
    Follow us on

    “మూడార్లు” నాలుగు కాలాలు నిలిచే సినిమానా ? మూడు గంటల్లో ముగిసే సినిమానా?
    బాహుబలికి మించిన సినిమానా?
    ఏడు బలమైన సీన్లు
    అంతకు మించిన ఎలివేషన్ సీన్లు
    సరిపోతాయా?
    “అవతార్ ” కు మించి సీన్లు ఉంటే చాలా
    కదిలించగల కథ ఉండవద్దా?
    ఇండియా లో ఏ సినిమా కు చేయని ప్రమోషన్ చేయడం వల్ల ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్.
    కానీ…
    పేరుకి భారీ వంట. దినుసులు బాగానే వేసినా నోటికి మాత్రం సరయిన రుచి తగలదు.
    బల్గేరియా, ఉక్రెయిన్ లో తీసినా కంటికి ఇంపుగా ఉంది. కానీ మెదడుకు మాత్రం సొంపుగా ఎక్కదు.

    Mahesh Babu Tweets On RRR

    RRR

    “మూడార్లు”

    కథాపరంగా చూస్తే, రాజమౌళి గత చిత్రాలతో పోలిస్తే చాలా చిన్న లైన్. స్వాతంత్య్రానికి పూర్వం ఒక బ్రిటీష్ దొర, దొరసాని ఆదిలాబాద్ జిల్లాలోని ( అప్పటికి ఆ ప్రాంతాన్ని నిజాం పాలిస్తున్నాడు) ఒక గోండుగూడేనికి వచ్చినప్పుడు కనిపించిన ఒక పదేళ్ల పాపను తమతో తీసుకుని వెళతారు. అలా తీసుకుపోవడానికి కారణం ఆ పాప మంచిగా పాడుతుంది. చిత్రాలు వేస్తుంది. ఆ పాపను తీసుకురావడానికి గోండు వీరుడు కొమురం భీమ్ బయలుదేరుతాడు. భీమ్ ఎంతటి వీరుడో, నిజం నవాబు ద్వారా తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం భీమ్ ను పట్టుకోవడానికి తన సైన్యం లో పనిచేస్తున్న అల్లూరి సీతారామ రాజును నియమిస్తుంది. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ఆయుధాగారాన్ని కొల్లగొట్టడానికి సైన్యంలో చేరిన కోవర్ట్. మొదట్లో రామ్, భీమ్ మధ్య మితృత్వం ఉంటుంది. తర్వాత శతృత్వంగా మారుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే అర్థం అవుతుంది.

    Also Read: Bangaru Telangana: తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

    1897 లో పుట్టి 1924 లో మరణించిన అల్లూరి సీతారామరాజు , 1901 లో పుట్టి 1940 లో చనిపోయిన కొమురం భీమ్ చరిత్రలో కలుసుకున్న దాఖలాలు లేవు. కానీ వాళ్లిద్దరూ 1920 లో కలుసుకున్నారని విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ఎంత స్వేచ్చ తీసుకున్నారనుకున్నా కొన్ని విషయాలు మిగుడు పడవు. అసలు కొరుకుడు పడవు. గుండె కు ఎదురుగా “గుండు” నిలిపినా విప్లవ గీతం పాడిన అల్లూరి సీతారామరాజు దొంగతనంగా బ్రిటీష్ సైన్యంలో చేరాడు అంటే అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు.

    ఈ సినిమాకు ప్రాణం గోండు పాపను అపహరించడం. అది కారణం. పాపను భీమ్ తీసుకురావడానికి వెళ్లడం అది కార్యం. ఈ కార్య కారణాల సంబంధం తనలో లీనం చేసుకోక పోతే ప్రేక్షకుడు సినిమాతో పాటు ప్రయాణం చేయడు. అలాంటప్పుడు
    ప్రేక్షకుడు ఒడ్డున కూర్చుని చెరువులో చేపపిల్లల కదలికలను చూస్తున్నట్టుగానో, గ్యాలరీలో కూర్చుని సర్కస్ చూస్తున్నట్టుగానే సినిమా చూస్తాడు. విసుగొస్తే లేచి వెళ్ళిపోతాడు.తీసుకెళ్లిన పాపను బ్రిటీష్ దంపతులు చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళే కనుక ఆ పాపను చిత్ర హింసలు పెట్టి , ఆ పాప తన రక్షకుడు ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంటే, అప్పుడు కొమరం భీమ్ రక్షకుడి అవతారం ఎత్తితే అప్పుడు ప్రేక్షకుడు కొమరం భీమ్ తో సహా ప్రయాణం చేస్తాడు.

    పాపను తీసుకెళ్లారనే బాధ గోండు తల్లిదండ్రుల్లో ఉందనే ఒక్క సీన్ కూడా మనకు అంజనం వేసి వెతికినా కనపడదు. ఇదే సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్జాన్ సినిమా హిట్ కావడానికి తప్పిపోయిన పాపే కారణం కదా. ఆ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాదే కథకుడు. అక్కడ చేసిన మాయాజాలం ఇక్కడ చేయలేక పోయాడు.

    రాంచరణ్ ను చూస్తుంటే చిరంజీవి “వేట”, జూనియర్, ఒలీవియా మధ్య దృశ్యాలు చూస్తున్నప్పుడు లగాన్ లో సీన్లు గుర్తుకొస్తే మీ తప్పేమీ లేదు. ఏది ఎక్కడి నుంచి తీసుకున్నారన్నది ప్రశ్న కాదు. తన సినిమా గొప్పగా ఉన్నదా లేదా అన్నదే రాజమౌళికి ముఖ్యం .
    సైరా సినిమాలో సురేందర్ రెడ్డి చేసిన తప్పే ట్రిపుల్ ఆర్ లో రాజమౌళి కూడా చేశాడు. సముద్రఖని లాంటి పెద్ద నటుడిని నామ మాత్రంగా పెట్టి తమిళ ప్రేక్షకులను కొల్లగొట్టాలి అనుకున్నాడు . అజయ్ దేవగణ్ ని కూడా సముద్రఖని లాగే ఊరికే కాస్టింగ్ కోసం పెట్టుకున్నట్టు వుంది. ఆ ప్లాష్ బ్యాక్ కూడా సాగతీత గా ఉంది. అలియా భట్ ఉంది అనుకుంటే ఉన్నది,లేదు అనుకుంటే లేదు అన్నట్టుగానే ఉంది. ఇక ఒకప్పటి ఛత్రపతి నటి శ్రియ ఒక్క సీన్ కు మాత్రమే పరిమితం అవడం బాధాకరం.
    రామ్ చరణ్ , జూనియర్ లలో నా ఓటు మాత్రం ఎన్టీఆర్ కే . అతడి నటనలోని పరిణితి ఆ పాత్ర చిత్రీకరణ లోని లోపాలని అధిగమించి చరణ్ వంటి బలమైన పాత్రతో ఢీకొట్టి సరి సమానంగా నిలిచింది.

    Also Read: Bodhan Nizamabad: బోధన్ గొడవ పెద్దదవుతోందా? అక్కడ హిందూ సంఘాల మోహరింపునకు కారణమేంటి?

    మొత్తంగా ఈ రణం, రౌద్రం, రుధిరం లో రెండు ఆర్ లు లోపించి ఒక్క రుధిరం మాత్రమే స్క్రీన్ మీద ప్రవహించింది. అది కూడా వేల లీటర్ల కొద్దీ..

    -ఎనబోతుల భాస్కర్

    Recommended Video:

    40 ఏళ్ళ తెలుగుదేశం ప్రస్థానం || Chandrababu Naidu Speech || TDP 40th Formation Day || Ok Telugu