Chicken Biryani- Balakrishna: ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూపాయకే కేజీ బియ్యం పథకం అప్పట్లో బాగా ఆదరణ దక్కించుకుంది. ఆ స్పూర్తితో బాలయ్య తన అభిమానులకు రెండు రూపాయలకే బిర్యానీ పెట్టాడు. బాలయ్య ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే. 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల బాలయ్యకు ప్రేమాభిమానాలు ఎక్కువ.

రెండు మూడు నెలలకు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. హిందూపురం ప్రజల కోసం బాలకృష్ణ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. పేద ప్రజలు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం చేస్తారు. కాగా హిందూపురం అన్నా క్యాంటీన్ లో బాలకృష్ణ చికెన్ బిర్యానీ ఏర్పాటు చేశారు. కేవలం రెండు రూపాయలకే కడుపునిండా చికెన్ బిర్యానీ పెట్టాడు. ఈ విషయం తెలిసి హిందూపురం జనాలు అన్నా క్యాంటీన్ కి పోటెత్తారు. కొందరైతే ఒకటికి రెండు సార్లు బిర్యానీ ఆరగించారు.
కడుపునిండా బిర్యానీ పెట్టిన బాలయ్య భేష్ అంటూ హిందూపురం జనాలు కొనియాడుతున్నారు. నేడు కాచిగూడలో గల తారకరామ థియేటర్ ని పునః ప్రారంభించారు. ఏషియన్ గ్రూప్ తారకరామ థియేటర్ ని సరికొత్త హంగులతో సిద్ధం చేసి తిరిగి సినిమా ప్రదర్శనకు అనుకూలంగా మార్చారు.ఈ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భం పురస్కరించుకొని హిందూపురం అన్నా క్యాంటీన్ లో చికెన్ బిర్యానీ ట్రీట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
కాగా అఖండ మూవీతో గత ఏడాది బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నారు. వరుస పరాజయాలకు స్వస్తి చెప్పి హిట్ ట్రాక్ ఎక్కారు. అలాగే ఏడాది కాలంలో కొత్త సినిమా పూర్తి చేసి వీరసింహారెడ్డిగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. వీరసింహారెడ్డి చిత్రం జనవరి 12న విడుదల కానుంది. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు .

వీరసింహారెడ్డి చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సమరంలో చిరంజీవి, విజయ్ లతో బాలకృష్ణ పోటీపడనున్నారు. వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలు సైతం సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య 108వ చిత్రం అనిల్ రావిపూడితో చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.