
Nagababu- Roja: ఓ పెద్ద ప్రాజెక్టో.. ఓ పెద్ద పరిశ్రమో ప్రారంభిండం.. అక్కడ ఫోటోలు దిగడం సాధారణం. కానీ వీధి కొళాయి ప్రారంభించి.. ఓ పెద్ద సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించినట్టు బిల్డప్ లు ఇవ్వడం అభ్యంతరకరం. చికెన్ షాప్ రిబ్బన్ కటింగ్ కు వెళ్లి .. పెద్ద పరిశ్రమ స్థాపించినట్టు ఫోటోలకు ఫోజులివ్వడం జుగుప్సాకరం. ఇంతకంటే దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా ?. అధికార పార్టీ నేతల విన్యాసాలు సోషల్ మీడియా కంపిస్తోంది. ప్రతిపక్షాలకు మంచి ఫీడ్ ఇస్తోంది. విమర్శలకు తావిస్తోంది. తాజాగా మంత్రి రోజా ప్రారంభించిన ఓ కార్యక్రమం వైరల్ గా మారింది.
ఏపీ మంత్రి రోజా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో.. ఆ తర్వాత జబర్దస్త్ తో తెలుగు ప్రజలకు సుపరిచితులు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి కూడా చేపట్టారు. అప్పటి వరకు బాగానే ఉన్న రోజా .. ఉన్నపళంగా మెగా ఫ్యామిలీ పై పడి ఏడ్వడం మొదలుపెట్టింది. ఇంతకీ రోజా ఏడుపెందుకని తరచిచూస్తే.. అధినేత జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలనే తపన తప్ప మరొక్కటి కాదట. అందుకే సమయం, సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీ పై, జనసేనాని పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతుంటారు. దీని పై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇస్తుంటారు.
తాజాగా మెగా బ్రదర్ నాగాబాబు కౌంటర్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోజా ఫోటో ఒకటి ట్విట్టర్లో నాగబాబు షేర్ చేశారు. ఆ ఫోటోకు అదిరిపోయే రైటప్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వివరాలు తెలియవు కానీ.. ఓ వీధిలో నీటి కొళాయిని ప్రారంభిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిని నాగబాబు షేర్ చేస్తూ రైటప్ ఇలా ఇచ్చారు. “ హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం.“ అంటూ అదిరిపోయే ట్వీట్ చేశారు.

రోజా పై నాగబాబు వేసిన పంచ్ మామూలుగా లేదు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా.. ఇప్పటి వరకు ఒక మంచి ప్రాజెక్టు ప్రారంభించిన పాపాన పోలేదు. అలాంటిది ఓ చిన్న నీటి కొళాయి ప్రారంభిస్తూ ఫోటో ఫోజులు ఇవ్వడం ఎంత హాస్యాస్పదం. చూస్తే నలుగురూ నవ్విపోదురు అన్న స్పృహ కూడా లేకుండా ఫోటోలు దిగడం వైసీపీ నేతలకే చెల్లు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క పెద్ద పరిశ్రమ వచ్చింది లేదు. దానిని ప్రారంభించిందీ లేదు. ఉన్నవాటినే పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో రోజా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పవచ్చు. దానికి నాగబాబు ట్వీట్ తోడవ్వడం.. ఇంకా వైరల్ గా మార్చిందని చెప్పవచ్చు.
హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం. pic.twitter.com/PXcD9tIurA
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 11, 2023