
Custody Movie Trailer Review: ” గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతోంది. అది ఎటునుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం, నిజం ఒక సైన్యం, ఎస్.. ద ట్రూత్ ఇన్ మై కస్టడీ” ఇలా సాగిపోయింది కస్టడీ ట్రైలర్ రివ్యూ లో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పలికిన డైలాగులు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్లో అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, శరత్ కుమార్, ప్రియమణి, అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్న కస్టడీ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.
ట్రైలర్లో కథ ఏమిటో స్పష్టంగా చెప్పారు వెంకట్ ప్రభు. ఇందులో ఉన్న సన్నివేశాలు చూస్తుంటే మాఫియా, పొలిటికల్, పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్టు కనిపిస్తోంది. అరవిందస్వామి మాఫియాను లీడ్ చేసే వ్యక్తిగా, శరత్ కుమార్ ఓ బిజినెస్ మాన్ గా, ప్రియమణి పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నారు. కృతి శెట్టి కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తున్నారు.. మొత్తానికి ఈ సినిమా సమాజంలో అనేక కోణాలను స్పృశించేలా తీసినట్టు కనిపిస్తోంది.

ఇక వెంకట్ ప్రభు విషయానికి వస్తే తమిళనాడులో పూర్తి డిఫరెంట్ చిత్రాలు తీసే దర్శకుడు. ఇతడికి తమిళనాడులో ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో కూడా ఈయన సరోజ అనే ఒక సినిమా తీశాడు. గత ఏడాది శింబు తో తీసిన మానాడు అనే సినిమా తమిళనాడులో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. శింబుకు మంచి కం బ్యాక్ మూవీ అయింది. టైం మిషన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత తీస్తున్న చిత్రం కావడంతో వెంకట్ ప్రభుపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా సరైన హిట్ లేని నాగచైతన్య ఈ సినిమాతో హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్ గా ఉంది. అన్నింటికీ మించి ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
