
Sai Pallavi: సాయి పల్లవి చాలా గ్యాప్ తర్వాత ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. లైంగిక వేధింపులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల లైంగిక వేధింపులకు గురైనదే. శారీరకంగానే కాదు మాటలతో ఇబ్బంది పెట్టడం కూడా లైంగికంగా వేధించడం అవుతుంది. మా అమ్మ, చెల్లి, చివరి బామ్మ ఇలా ప్రతి స్త్రీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే. ఈ సమస్య ఎదురుకాని ఆడపిల్లను నేను చూడలేదు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలి? చెబితే నమ్ముతారా? అని సంకోచించే వాళ్ళు నా సినిమా(లవ్ స్టోరీ) చూశాక ధైర్యంగా తమకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి పేరెంట్స్ తో చెప్పవచ్చు, లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందవచ్చు… అని సాయి పల్లవి అన్నారు.
నాగ చైతన్యకు జంటగా ఆమె నటించిన లవ్ స్టోరీలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాయింట్ ప్రధానంగా చర్చించాడు. హీరోయిన్ సాయి పల్లవి సొంత బాబాయ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిగా కనిపించారు. లవ్ స్టోరీ మూవీ తమ బాధను చెప్పుకోలేక మనసులో మదనపడుతున్న అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే చిత్రమని సాయి పల్లవి అన్నారు.
ఈ షోలో సాయి పల్లవి మరిన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో ఎవరితో డాన్స్ చేయాలని కోరుకుంటావని అడగ్గా… ఆమె తెలివైన ఆన్సర్ చెప్పి తప్పుకుంది. ముగ్గురితో ఒక పాట చేస్తాను. అది చాలా మజా ఇస్తుందని చెప్పారు. సాయి పల్లవి ఆన్సర్ హోస్ట్ మైండ్ బ్లాక్ చేసింది.

కాగా సాయి పల్లవి సడన్ గా స్లో అయ్యారు. డిమాండ్ ఉన్నప్పటికీ ఆమె సినిమాలు చేయడం లేదు. మంచి సబ్జక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను, అందుకే ఆలస్యమవుతుందని చెప్పుకొస్తున్నారు. పుష్ప 2 మూవీలో సాయి పల్లవి అంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని విశ్వసనీయ సమాచారం. తమిళంలో శివకార్తికేయన్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారట. తెలుగు ప్రేక్షకులు ఆమెను సిల్వర్ స్క్రీన్ పై బాగా మిస్ అవుతున్నారు. చివరిగా సాయి పల్లవి విరాటపర్వం మూవీలో నటించారు. 2021 సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ భారీ హిట్ కొట్టాయి.