Mukundan Unni Associates Review : కేజీఎఫ్, బిజినెస్ మేన్… ఈ సినిమాలు చూశారు కదా! డైరెక్టర్లు హీరోల్లో ప్రతినాయక కోణాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన సినిమాలు.. సగటు ప్రేక్షకుడిని ఆ పాత్రలో ఐడెంటిఫై చేసుకునేలా రూపొందించారు అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమాలకు రగ్ డ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.. ఎందుకంటే అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది.. తాజాగా ఈ జాబితాలో మలయాళం సినిమా ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ కూడా చేరింది.. ఓ కేజీఎఫ్, బిజినెస్ మేన్ లో యశ్, మహేష్ ఉన్నారు కాబట్టి భారీగా బజ్ క్రియేట్ అయింది. మరి ఈ ముకుందన్ ఉన్ని లో కాగడ పెట్టి వెతికినా బజ్ క్రియేట్ చేసే తోపు హీరో లేడు.. కానీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తోంది.. అంతేకాదు ఒక సెక్షన్ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తోంది.. నిజంగా ఆకాశానికి ఎత్తేసేంత సీన్ ఈ సినిమాలో ఉందా? ఈ సినిమా చూసిన తర్వాత మరో కోణం కళ్ళ ముందు కనిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి మంచి నటుడే. కానీ మంచి నటన మంచి సినిమా అనిపించుకోదు.. విలువలు ఇలా దిగజారడాన్ని మనం అంగీకరిస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న . విలన్ చేయాల్సిన పనులన్నీ హీరో చేస్తే కూడా హీరో యేనా.. కొన్ని తప్పుడు పనులను లార్జెర్ దెన్ లైఫ్ సైజులో చూసేవాళ్లను విపరీతంగా ఆరాధించే మనుషులు మనకు తెలుసు. రెండు వేల కోట్లు షేర్ మార్కెట్లో గల్లంతయినప్పుడు హర్షద్ మెహతాను చాలామంది విపరీతంగా ఆరాధించారు.. ఇదొక్కటే కాదు ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో ఎందుకున్నాయంటే మన విలువల గ్రాఫ్ పాతాళం కంటే కిందకు పడిపోవడం వల్ల.. మోసం చేయడం అనైతికం కాదని… అది ఎంత నైపుణ్యంతో చేస్తే అంత ప్రేమార్హంగా మోహించే ఉన్మత్తత లోకి సమాజం దూకేసినట్టుంది. ఇప్పుడు పుష్ప లాంటి స్మగ్లర్ ని గ్లోరిఫై చేసే విలన్ హీరో సినిమాలు పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యేది కూడా దేశమంతా ఒకే తరహా ప్రేక్షకులు ఉన్నాడని చెప్పేందుకే…
వృత్తిలో విఫలమైన ఒక లాయర్ తొక్కే అడ్డదారులే ఈ మలయాళ సినిమా కథ.. చిన్న చిన్న మోసాలు, పెద్ద పెద్ద ద్రోహులు, ఇంకా బడాబడా హత్యలు, అన్నీ చేసేసి అదే జీవితానికి ఆర్థిక మోక్ష మార్గం అని చాటి చెప్పే సినిమా ఇది. విలన్లే హీరోలైన సినిమాలు మనకు చాలా ఉన్నాయి.. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్, కమల్ హాసన్ నటించిన ఎర్ర గులాబీలు, షారుఖ్ ఖాన్ నటించిన బాజిగర్ లాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ పాత్రలకు తమదైన ఒక వాదన ఉంటుంది.. తమ తప్పుడు లేదా హింసాత్మక, క్రూరాత్మక చేష్టలను సమర్ధించుకుంటూ ప్రేక్షకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాయి లేదా చివరికి రియలైజ్ అవుతాయి. ఈ ముకుందన్ కేవలం తన జీవితంలో ఆర్థికంగా ఎదిగేందుకు యాక్సిడెంట్ బీమా క్లైమ్ లలో నానా గడ్డీ కరుస్తాడు. పద్ధతిగా ఉండే ఒక ప్రియురాలితో బ్రేకప్ కూడా చేసుకుంటాడు . ఒక కాంట్రాక్ట్ కోసం ఇంకో ప్రియురాలిని ప్రేమించడం మానేసే బేరం పెడతాడు. అంతేకాదు ఇంకా ఇంకా చాలా పాపాలకు పాల్పడతాడు. అతను అలా కరిచిన డబ్బుతో కోటీశ్వరుడు కావడమే ఈ కథలో దర్శకుడు చెప్పిన నీతి. ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ క్లెయిమ్ ల రంగంలో బీభత్సమైన అవినీతి ఉన్న మాట నిజం . దానిని మొత్తం వివరిస్తూనే ఆ రంగాన్ని సరిచేసే ప్రయత్నం హీరో చేసినట్టు చెబితే బాగుండేది.. ఓ పుష్ప, ముకుందన్ లాంటి కొన్ని సినిమాలు విలన్ ని హీరోకి పర్యాయపదంగా మార్చేయడం కేవలం మన విలువల కొలతలలో మనం చేసుకున్న మార్పులే.. అందరూ సినిమా బాగుందని అంటున్నారు. కానీ పడిపోతున్న విలువల గ్రాఫ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. స్థూలంగా చెప్పాలంటే డబ్బు సంపాదనకు ఎలాంటి గడ్డి కరిచినా పర్వాలేదు అనే స్థాయికి మనం దిగజరామా? లేక దీనినే నీతి అనే స్థాయికి ఎదిగామా? ఒకసారి ఆలోచించుకోవాలి.