Mudragada Padmanabham Letter: ముద్రగడ పద్మనాభం.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. మంత్రిగా, ఎంపీగా పనిచేశారు.అయితే ఆయన రాజకీయ నాయకుడి కంటే..కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే తెలుగునాట గుర్తింపు పొందారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం పతాక స్థాయికి తీసుకెళ్లారు. చంద్రబాబు సర్కారుపై గట్టిగానే పోరాడారు. అదే తుని రైలు విధ్వంసానికి దారితీసింది. అటు చంద్రబాబు స్పందించారు. ఈబీసీ రిజర్వేషన్లు 5 శాతాన్ని కాపులకు కేటాయించారు. అయితే ఇప్పుడు ఆ 5 శాతాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. అయితే ఇది జరిగి మూడున్నరేళ్లవుతోంది. అటు సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆ 5 శాతం రిజర్వేషన్లు సహేతుకమేనని చెప్పడంతో ముద్రగడ స్పందించడం అనివార్యంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక ఉద్యమం అవసరం లేదని.. కాపు సంఘాలు తన వైపు అనుమానాపు చూపులు చూస్తున్నాయని ముద్రగడ ఉద్యమాన్ని బంద్ చేశారు. ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు కాపుల ఈబీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ తప్పనిసరి అయ్యింది. జగన్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ సమయంలో స్పందించకపోతే విమర్శలు వస్తాయని భావించిన ముద్రగడ సీఎం జగన్ కు లేఖ రాశారు.

అయితే ముద్రగడ భయం భయంతో సీఎం జగన్ కు లేఖ రాశారు. పూర్తి వినయ, విధేయతతో, వినమ్రతతో లేఖ రాసినట్టుంది. ముద్రగడ లేఖ రాశారనేదానికంటే.. లేఖ సారాంశమే ఇప్పుడు హైలెట్ అవుతోంది. ముద్రగడకు జగన్ అంటే అంత భయం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం లేఖ ఎందుకు రాశారో? డిమాండ్ ఏంటన్నది స్పష్టం చేయలేని స్థితిలో ముద్రగడ ఉండడం విమర్శలకు తావిస్తోంది. ముద్రగడ కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. జగన్ తీసుకున్నదానినే పునరుద్ధరించమన్నది చిన్న విన్నపం. రైళ్లను తగులబెట్టి, విధ్వంసాలు సృష్టించే రేంజ్ లో ఉద్యమాలు చేశారు. నాటి సర్కారుపై చూపిన తెగువ, ధైర్యం ఇప్పుడెందుకు చూపలేకపోతున్నారన్నది ప్రశ్న. మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశ్యం కాదంటూ ముద్రగడ పేర్కొనడంపై కూడా సెటైర్లు పడుతున్నాయి.
2019లో ఏపీ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాపులు అడిగింది ఏమిటి? మీరు చేస్తున్నదేమిటి అంటూ గద్దెనెక్కిన జగన్ ఆ 5 శాతం రిజర్వేషన్లను రద్దుచేశారు. చట్టబద్దత లేని ఈబీసీ రిజర్వేషన్లతో కాపులు తాము బీసీలమా? ఓసీలమా? అని అనుమానం పడతారని కూడా చెప్పుకొచ్చారు.

అయితే నాడు చంద్రబాబు సర్కారు కాపులకు అందించిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు సహేతుకమేనని సుప్రీం కోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి జగన్ సర్కారుకు దాపురించింది. కానీ ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. దీంతో ముద్రగడ ఎక్కడ అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన సీఎం జగన్ కు భయపడుతూ లేఖ రాశారు. బతిమలాడుతూ విన్నపాలు చేసుకున్నారు. అందరూ అనుభవించగా మిగిలిన వాటికే అమలుచేయాలని కోరుతున్నామని… మిమ్మల్ని ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యం కాదని చెప్పుకొచ్చారు. ఈ రిజర్వేషన్లు అమలుచేసి కాపుల అండతో మరోసారి విజయం దక్కించుకోవాలని కూడా సూచించారుట. మొత్తానికి చాలా రోజుల తరువాత లేఖరాసిన ముద్రగడ జగన్ పట్ల చూపుతున్న వినయ విధేయతలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.