Maharashtra Love Marriage: సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. కానీ ఈ జంట విషయంలో స్వర్గం స్థానంలో శ్మశానం అని రాసుకోవాలేమో. ఎందుకంటే వారి పెళ్లి జరిగింది అక్కడ కాబట్టి.. వినడానికే విచిత్రంగా ఉంది కదూ.. కొంతమంది దీనిని చూసి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం నిజమవుతోందేమో అనుకుని ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి విడ్డూరాలు ఇంకా ఎన్ని చూడాలో అంటూ ఆశ్చర్యపోయారు.. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ అంటే.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. రోజులపాటు ఇద్దరి మధ్య వ్యవహారం గట్టిగానే సాగింది. ప్రేమ ముదిరిపాకాన పడిన తర్వాత చేసుకోవాల్సింది పెళ్లే కాబట్టి.. ఆ విషయాన్ని ఆ యువతి తన తండ్రికి చెప్పింది. అయితే అతడు వెంటనే పెళ్లికి ఒప్పుకోలేదు. కొద్ది రోజులు సినిమా నడిచిన తర్వాత చివరికి అతనికి తప్పలేదు. కూతురికి చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదు కాబట్టి ఆయన వెంటనే పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఈ పెళ్లి అలాంటి ఇలాంటిది కాదు. సభ్య సమాజం దెబ్బకు నోరు వెళ్ళబెట్టింది. చుట్టూ ఉన్న జనం కళ్ళు అప్పగించి చూశారు.
ఇంతకీ ఆ అమ్మాయి తండ్రి పేరు గంగాధర్.. అతడిది మహారాష్ట్రలోని షిరిడి సమీపంలోని రహత గ్రామం. ఇతడు మహా సంజోగి సామాజిక వర్గానికి చెందినవాడు. స్థానికంగా కాటికాపరిగా పనిచేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా కుటుంబంతో కలిసి శ్మాశనం లోనే ఉంటున్నాడు..ఇతడి కుమార్తె పేరు మయూరి. ఇంటర్ వరకు చదివింది. అందుకునే సమయంలోనే మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. తర్వాత ఇద్దరి పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకరించాయి. అయితే మయూరి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేస్తానని గంగాధర్ ఒక షరతు పెట్టాడు. దీనికి ఆ అబ్బాయి తరపు వారు ఒప్పుకున్నారు. ఫలితంగా శ్మశాన వాటికలోనే ఇద్దరి పెళ్లి ఘనంగా చేశారు. విందు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. కాగా పెళ్లి తంతు స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.