
Maharashtra: మహారాష్ట్రలో ఓ అద్భతం వెలుగు చూసింది. శతాబ్ధాల క్రితం నాటి విగ్రహం బయటపడింది. ఇప్పుడు అదొక చారిత్రక ప్రాంతంగా మారిపోయింది. చరిత్రను వెలికితీయడానికి శాస్త్రవేత్తలకో ఆధారం దొరికింది. భారతీయత ఎంతటి పురాతనమైనదో ఈ విగ్రహం తేల్చనుంది. ఇంతకీ మహారాష్ట్రలో దొరికిన విగ్రహం ఎవరిది ? ఏ శతాబ్ధానికి చెందినది ? ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహారాష్ట్రలో ఓ అందమైన శ్రీకృష్ణుని విగ్రహం బయటపడింది. ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా చంద్రపూర్ లో ఈ విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఇది పన్నెండు వందల ఏళ్ల క్రితం నాటి విగ్రహంగా చెబుతున్నారు. చాళుక్యుల కాలానికి చెందిన విగ్రహంగా దీనిని గుర్తించారు. దీని పై మరింత పరిశోధన చేసేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. చాళుక్యుల కాలంనాటి నిర్మాణాలు ఏవైనా చంద్రపూర్ ప్రాంతంలో ఉన్నాయా ? అన్న కోణంలో పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
శ్రీకృష్ణుని విగ్రహం వెలుగులోకి రావడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్ వాసులు కోలాహలంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యం ఉప్పొంగుతోంది. ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శ్రీకృష్ణుడికి పూజలు చేస్తున్నారు. అదే ప్రాంతంలో దేవాలయం నిర్మించే ఆలోచనలో స్థానికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పై ఇది ఆధారపడి ఉంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తల నుంచి పూర్తీ స్థాయి సమాచారం వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన శ్రీకృష్ణుని విగ్రహం పురాతన భారతీయతకు చిహ్నమని పలువురు భావిస్తున్నారు. వేల ఏళ్ల కిందట ధర్మం ఈ నేల పై నడయాడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తే మరిన్ని వెలుగుచూడని అంశాలు బయటపడతాయని పలువురు ఆశిస్తున్నారు. చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై తప్పక ఉందని సూచిస్తున్నారు. చంద్రపూర్ లో మరింత లోతుగా తవ్వకాలు జరిగితే చాళుక్యుల కాలం నాటి మరిన్ని అద్భుతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.