Chandrabose vs Yandamoori Veerendranath : ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ కి సినీగేయ రచయిత చంద్రబోస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయనకు పురాణాలు, శాస్త్రాలు తెలుసా? అని మండిపడ్డారు. వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ లోని పదప్రయోగాలను యండమూరి తప్పుబట్టిన నేపథ్యంలో చంద్రబోస్ ఫైర్ అయ్యారు. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. వాల్తేరు వీరయ్య మూవీలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా, నేచర్ తెలిపేలా ఈ సాంగ్ చంద్రబోస్ రాశాడు. దీని కోసం కొంచెం బలమైన పదబంధాలు రాసుకున్నారు. ప్రాసతో సాగేలా చూసుకున్నారు.
అయితే చంద్రబోస్ సాహిత్యాన్ని యండమూరి తప్పుబట్టారు. ఆయన పదప్రయోగంలో లోపాలు వెతికాడు. ”తుపాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే…” ”తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే….”అన్న చరణాలను ఉద్దేశిస్తూ… తుఫాను అంచున తపస్సు చేయడమేంటి… రెండు విరుద్ధ స్వభావాలు కలిగిన పదాలు ఎలా వాడతారు. అసలు తిమిరం అంటే ఆయనకు అర్థం తెలుసా అని అన్నారు. యండమూరి వ్యాఖ్యలు చంద్రబోస్ ని హర్ట్ చేశాయి. ఆయన ఉద్దేశపూర్వకంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యండమూరికి గట్టి కౌంటర్లు ఇచ్చారు.
నేరుగా యండమూరికే చెబుతున్నానన్న చంద్రబోస్… తెలుగు లిటరేచర్ లో విరోధాబాసాలాకారం ఒకటి ఉంది. ఆ అలంకారాన్ని ఉపయోగించి ఈ పాట రాసాను. ఈ అలంకారం ప్రకారం రెండు విరుద్ధ పాదాల అర్థం అభాసం అవుతుంది. అబాసం అంటే పోతుంది అని భావం. ఇక్కడ కనిపించే రెండు విరుద్ధ పదాల అర్థం కాకుండా నిఘూఢమైన మరో అర్థం గోచరిస్తుంది. ఇది విరోధాబాసాలంకారం లక్షణం. అది శాస్త్రంలో ఉన్న విషయం. విరోధాబాసాలకారం అనుసరించి రాశాను.
తుపాను అంచున తప్పస్సు చేసే వసిష్ఠుడు అంటే… అలజడులు, ఒడిదుడుకుల మధ్య కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఇబ్బందులకు, బాధలకు చలించడు అని అర్థం. ఇక తిమిర నేత్రుడు అంటే… చీకటిలా ఆవరించి శత్రువులపై దాడి చేసేవాడు, అని ఒక అర్థం వస్తుంది. అలాగే ఆవేశం వస్తే గుడ్డిగా వెళ్లి దాడి చేస్తాడు, అంటాం కదా, ఆ అర్థం కూడా వస్తుంది. తిమిరం అంటే ఆయనకు అర్థం తెలుసా? అని యండమూరి అన్నారు. ఒక రచయితకు తిమిరం అంటే అర్థం తెలియదని మరొక రచయిత అనుకోవడం నిజమైన తిమిరం.
పదాలకు అర్థాలు తెలియకుండా పాటలు రాయను. పాటను ఆస్వాదించాలంటే సౌందర్య దృష్టి ఉండాలి. రసజ్ఞత ఉండాలి. అప్పుడే దానిలోని గొప్పతనం కనిపిస్తుంది, అన్నారు. యండమూరి ఆరోపణలకు చంద్రబోస్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆయనకు పురాణాలు తెలుసా, తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉందా? అని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. యండమూరి ఆరోపణలు చంద్రబోస్ కౌంటర్స్ తో వాతావరణం వేడెక్కింది. మరి యండమూరి ఆయన వివరణతో ఏకీభవిస్తారా? లేక కౌంటర్ ఇస్తారా? అనేది చూడాలి.