
Mancherial: వారిద్దరూ చిన్ననాటి మిత్రులు.. ఇద్దరిదీ ఒకే ఊరు.. ఒకే వీధి. వయసు పెరిగేకొద్ది స్నేహితు మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి.. సంతోషంగా జీవించాలనుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పారు. పెద్దలు కూడా చిన్నతనం నుంచి కలిసి ఉన్న ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుంటామంటున్నారు.. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉంటారని అనుకున్నారు. పెళ్లికి ఇళ్లలో ఓకే చెప్పారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్‌తో వారి ప్రేమలో మెచ్యూరిటీ లేదని అర్థమైంది.
ప్రేమో.. ఆకర్షణో తెలియకుండా సాగిన వారి ప్రయాణం.. చివరకు కాటికి చేరింది. పెద్దలు పెళ్లికి అంగీకరించినా పెళ్లి తర్వాత కష్టాలను ఎదుర్కొని జీవించలేని తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
స్నేహితులే.. ప్రేమికులుగా మారి..
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండకు చెందిన నరెడ్ల సిద్ధయ్య – వసంత దంపతుల చిన్న కుమార్తె సంఘవి డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన నాగవెల్లి శ్రీకాంత్ ఆటో డ్రైవర్. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకే వీధిలో కలిసి పెరిగారు. మంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సంఘవి స్నేహితుడు శ్రీకాంత్‌ను ఇష్టపడింది. గాఢంగా ప్రేమించింది. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి కలిసి జీవించాలనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. కోరుకున్నవాడినే పెళ్లి చేసుకోబోతున్నందుకు సంఘవి చాలా సంతోషంగా ఉంది.
డ్యాం వద్దకు తీసుకెళ్లి..
ఈ క్రమంలో ఈనెల 17న(శుక్రవారం) శ్రీకాంత్ ప్రియురాలు సంఘవిని తీసుకుని తన ఆటోలో ఎల్లంపల్లి డ్యాం వైపు వెళ్లాడు. అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆర్థిక అంశాలు చర్చకు వచ్చాయి. శ్రీకాంత్ తనకు బాగా అప్పులు పెరిగిపోయాయని తెలిపాడు.పెళ్లి చేసుకుంటే జీవనం కష్టంగా మారుతుందని.. వివాహం చేసుకోలేనని చెప్పాడు. తనకు బతకాలని కూడా లేదని వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన సంఘవి ఆ సీసా లాక్కొని తాను కూడా తాగేసింది.
బతకాలన్న తాపత్రయం..
తను పెళ్లిచేసుంకే సంఘవికి కష్టాలు తప్పవని శ్రీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడో ఏమో కానీ, ప్రియురాలు కూడా నీవెంటే నేను అని పురుగుల మందు తాగడంతో శ్రీకాంత్ ఆందోళనకు గురయ్యాడు. ఇద్దరం బతకాలనుకున్నాడు. వెంటనే ఆటోలో ఇద్దరూ కలిసి మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మార్గ మధ్యంలోనే కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ఇద్దరూ వెళ్లి ప్రభుత్వాస్పత్రిలో జాయిన్ అయ్యారు.

2 గంటల వ్యవధిలో ఇద్దరూ మృతి..
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ శనివారం రాత్రి 9 గంటలకు మృతిచెందాడు. రాత్రి 11 గంటలకు సంఘవి కూడా ప్రాణాలు వదిలింది. కోరుకున్నవాడితో కలిసి బతకాలని కలలుకన్న సంఘవి.. చివరకు కలిసి బతకకపోయినా చావును మాత్రం పంచుకుంది. సంఘవి బాగుండాలనుకుని, తనను పెళ్లి చేసుకోవడం సరికాదని భావించిన ఆత్మహత్య చేసుకుందామనుకున్న శ్రీకాంత్ మెచ్యూరిటీ లేని ప్రేమ కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి.