Love Trailer Review: దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి, ముంతాజ్ షాజహాన్, వాలెంటైన్.. గొప్ప గొప్ప ప్రేమ కథలన్నీ విషాదంతాలే. ప్రేమంటేనే త్యాగం కాబట్టి అ త్యాగానికి వేరే కొలమానం ఉండదు. ఒకవేళ కొలమానం కావాలి అంటే అది ప్రేమే అయి ఉండాలి. చరిత్రలో కొన్ని ప్రేమకథలు మాత్రమే చరితార్థం అయ్యాయి. వినతి కెక్కని, ఘనత వహించని ఎన్నో ప్రేమలు చరిత్రపుటల్లో అలా కనుమరుగైపోయాయి. అలాంటి ప్రేమ కథనే మరుగున పడిపోయిన మాండలికంలో చెప్పే ప్రయత్నమే @ లవ్. సినిమా మీద పాషన్ తో కొంతమంది కలిసి చేసిన ప్రయత్నం ఇది. డిసెంబర్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదలైంది.

-ఎలా ఉందంటే
ముందుగానే చెప్పినట్టు ఈ సినిమా అటవీ నేపథ్యం, వర్తమాన నేపథ్యం ఆధారంగా సాగుతుంది. రెండు జంటలను ఇందులో చూపించారు. వారు తమ ప్రేమ కోసం పడుతున్న ఆవేదన, ఎదురైన సవాళ్లు ఇందులో కొత్తగా కనిపించాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో సాగే కథలో అయితే గిరిజనులు మాట్లాడిన మాండలికం చాలా బాగుంది. నటీనటులు మాట్లాడుతుంటే కాంక్రీట్ జంగిల్ లో మట్టిని స్పర్శించినట్టు ఉంది. సాధారణంగా అడవి మనుషుల మధ్య ప్రేమ స్వచ్చంగా ఉంటుంది. దానిని తెరపైన ఉన్నది ఉన్నట్టు దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. వారి ఆచారాలు, వ్యవహారాలు, కట్టు, బొట్టు కళ్ళకి కట్టాయి.. ట్రెయిలర్ లో దాదాపు కథ మొత్తం చెప్పారు. బడ్జెట్ పరిమితుల దృష్టా ఉన్నంత లో ఈ సినిమా ఫోటోగ్రఫీ కనులకు విందుగా ఉంది. ముఖ్యంగా అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, దానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కటి అనుభూతినిస్తోంది.
-కొత్తగా చూపించే ప్రయత్నం
ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో మాండలికం ఆధారంగా ప్రేమ కథలు రాలేదు. కానీ మరుగున పడిపోయిన మాండలికాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈ చిత్ర దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది.. మాడలికంపై బాగా పరిశోధన చేస్తే తప్ప ఇటువంటి సినిమాలు తీయడం కష్టం. తమిళంలో ఇటువంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. మరి మన దగ్గర ఎలా ఉంటుందో ఈ సినిమా విడుదలయితే గాని తెలియదు.

ఇది సినిమా తారాగణం
ఈ చిత్రంలో సీనియర్ నటుడు రామరాజు కీలకపాత్ర పోషించారు.. సోనాక్షి వర్మ, ప్రీతి సుందర్, అభి, శ్రీ కృష్ణ, డాక్టర్ మారుతి, నవకాంత్, నరేష్, రాంబాబు, మనోహర్, తదితరులు నటించారు. ఈ సినిమాకి శ్రీ నారాయణ దర్శకత్వం వహించారు. టీ ఎం ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మించింది. మహేందర్ సింగ్, తాటిచెర్ల శైలజ, శ్రీ నారాయణ నిర్మాతలుగా వ్యవహరించారు.. ఈ సినిమాకి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్, రామ్ చరణ్, సన్నీ మాలిక్ సంగీతం అందించారు. డిసెంబర్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.