London Tower Bridge: బ్రిటన్ లోని లండన్ నగరంలో థేమ్స్ నదిపై నిర్మించిన టవర్ బ్రిడ్జి అనూహ్యంగా వార్తల్లోకెక్కింది. ప్రపంచంలో ఇంజనీరింగ్ నైపుణ్యానికి మెచ్చు తునకల్లాంటి నిర్మాణాల్లో టవర్ బ్రిడ్జి కూడా ఒకటి. ఇక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించిన సినిమాల షూటింగ్ లు జరుగుతుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో, మహేష్ బాబు నటించిన 1; నేనొక్కడినే” వంటి సినిమాల షూటింగ్లు కూడా ఇక్కడే జరిగాయి. టవర్ బ్రిడ్జి నిర్వహణ లండన్ నగరపాలక సంస్థ చూసుకుంటుంది. థేమ్స్ నదిపై నిర్మించిన ఈ టవర్ బ్రిడ్జి అరుదైన ప్రత్యేకత ఉంది. నదీ మార్గంలో పెద్ద ఓడలు వస్తే బ్రిడ్జిని పైకి లేపే వెసలుబాటు ఉంటుంది. ఇప్పుడు ఆ వెసలు బాటే బ్రిటన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేసింది. టవర్ బ్రిడ్జి లోని లోపాన్ని సభ్య సమాజం ముందు ఉంచింది.
థేమ్స్ నదిలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. లండన్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు సరదాగా పడవల్లో విహరిస్తూ ఉంటారు. అయితే ఓ దారి పడవకు దారి ఇచ్చే క్రమంలో టవర్ బ్రిడ్జి వంతెనను పైకి లేపారు. పైకి అయితే లేపారు కానీ.. దానిని కిందికి దించడంలో సాంకేతిక లోపం తలెత్తింది. అది అసలు కిందికి దిగకపోవడంతో టవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జాం అయింది. “లండన్ నగరంలో నిర్మించిన టవర్ బ్రిడ్జి ఇటు నది రవాణాకు, అటు రోడ్డు ప్రయాణాలకు వీలుగా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం ఒక భారీ పడవ వెళ్లేందుకు వంతెనకు చెందిన రెండు టవర్ల మధ్య భాగాన్ని పైకి లేపారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే పైకి లేచిన భాగం భారీ పడవ వెళ్లిన తర్వాత కిందికి దిగాలి.. కానీ సాంకేతిక లోపం కారణంగా అది యధా స్థానానికి రాలేదు. దీంతో రోడ్డు నుంచి వంతెన మీదుగా వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అది కాస్తా లండన్ వీధుల్లో ట్రాఫిక్ జామ్ కు దారితీసిందని” అక్కడి స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
” వంతెన పైకి లేచి ఉండడం చూసి ఎందుకు మొదట బాగానే అనిపించింది. కానీ కొంతసేపయిన తర్వాత లండన్ నగరం మొత్తం స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అరగంట విరామం తర్వాత బ్రిడ్జి కిందికి దిగడంతో అందరి మొహాల్లో సంతోషం కనిపించింది” అని లండన్ నగరపాలక సంస్థకు చెందిన ఒక అధికారి తెలిపారు. కాగా, థేమ్స్ నదిపై ఈ కదిలే వంతెన నిర్మాణం 1894లో పూర్తయింది. దీని జంట టవర్లు నదికి 61 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిర్మించిన స్కైవాక్ ప్రత్యేక ఆకర్షణ. దీనిపై నుంచి కిందికి చూస్తే రహదారిపై వెళ్తున్న వాహనాలు, వాటి కిందనే నీటిలో ప్రయాణిస్తున్న పడవలను చూడవచ్చు. కాగా, టవర్ బ్రిడ్జిలో వంతెన తెరుచుకునే మార్గంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒకసారిగా చర్చనీయాంశమైంది. టవర్ బ్రిడ్జి కిందికి దిగకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా ఈ టవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నమూనాగా తీసుకొని పలు దేశాలు వివిధ ఆకారాల్లో నదులపై వంతెనలు నిర్మించాయి.